Ramabanam Review: `రామబాణం` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | May 5, 2023, 1:36 PM IST

గోపీచంద్‌ కి చాలా కాలంగా సరైన హిట్లు లేవు. `లౌక్యం`, `జిల్‌` తర్వాత ఇప్పటి వరకు హిట్‌ పడలేదు. దీంతో తమ `లక్ష్యం`, `లౌక్యం` వంటి హిట్‌ కాంబినేషన్‌ని రిపీట్‌ చేస్తూ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు `రామబాణం` చిత్రం చేశారు. నేడు(మే 5న)శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

గోపీచంద్‌ అంటే కమర్షియల్‌ సినిమాలకు పెట్టింది పేరు. మాస్‌, కమర్షియల్‌ అంశాలు, యాక్షన్‌ ఆయన సినిమాల్లో ఉండాల్సిందే. కథ కూడా వాటి చుట్టే తిరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయనకు సరైన విజయాలు లేవు. `లౌక్యం`, `జిల్‌` తర్వాత ఇప్పటి వరకు హిట్‌ పడలేదు. ఆ మధ్య వచ్చిన `సీటీమార్‌` బలవంతంగా ఆడింది. దీంతో తనకు చివరి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్‌తో కలిశాడు. దర్శకుడికీ కూడా `లౌక్యం` తర్వాత హిట్‌ లేదు. దీంతో తమ `లక్ష్యం`, `లౌక్యం` వంటి హిట్‌ కాంబినేషన్‌ని రిపీట్‌ చేస్తూ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు `రామబాణం` చిత్రం చేశారు. నేడు(మే 5న)శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమాతో గోపీచంద్‌-శ్రీవాస్‌ కాంబో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిందా? లేక బోల్తా పడిందా? అనేది రివ్యూ(Ramabanam Review)లో తెలుసుకుందాం. 

కథః

రఘుదేవపురంలో రాజారాం(జగపతిబాబు) తన భార్య భువనేశ్వరి(ఖుష్బూ)తో కలిసి సుఖీభవ అనే హోటల్‌ని నడిపిస్తుంటాడు. ఆర్గానిక్‌ ఫుడ్‌ని అందించే హోటల్‌ కావడంతో దీనికి ఆదరణ ఎక్కువ. దీని కారణంగా ఎదురుగా ఉన్నా పాపారావు(నాజర్‌) హోటల్‌ నడవదు. దీంతో రాజారాం హోటల్‌పై దాడి చేస్తాడు. అందుకు ప్రతీకారంగా రాజారం తమ్ముడు విక్కీ (చైల్డ్ ఆర్టిస్ట్) పాపారావు గోదాంకి నిప్పు పెడతాడు. విక్కీపై కేసు పెట్టగా, అన్న రాజారాంని ఎదురించి కోల్‌కత్తాకి పారిపోతాడు. అక్కడ ఓ డాన్‌ వద్ద చేరి, వారి ప్రత్యర్థి ముఖేష్‌ని దెబ్బకొట్టి వీక్కీ భాయ్‌(గోపీచంద్‌) అనే పెద్ద డాన్‌గా ఎదుగుతాడు. కోల్‌కత్తాలో యూట్యూబ్‌ వీడియోలు చేసే భైరవి(డింపులు హయాతి) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు విక్కీ. పెళ్లి సంబంధం కోసం వారి ఇంటికి వెళ్లగా భైరవి నాన్న(సచిన్‌ ఖేడ్కర్‌) ఓ కండీషన్‌ పెడతాడు. దాని కారణంగా 14 ఏళ్ల తర్వాత అన్న రాజారాం వద్దకు(హైదరాబాద్‌కి) వస్తాడు విక్కీ. తాను డాన్‌ అనే విషయం దాస్తూ మ్యానేజ్‌ చేస్తాడు. ఇక్కడ పాపారావు అల్లుడు జీకే(తరుణ్‌ అరోరా)తో ఇబ్బంది పడుతుంటాడు రాజారాం. ఆ విషయాన్ని తమ్ముడు వద్ద దాస్తారు. మరి ఇంతకి విక్కీ మళ్లీ అన్న ఇంటికి ఎందుకొచ్చాడు? జీకేతో రాజారాంకి ఉన్న గొడవేంటి? దీనికి కల్తీ ఫుడ్‌కి ఉన్న సంబంధం ఏంటి? విక్కీకి భైరవి తండ్రి పెట్టిన కండీషన్‌ ఏంటి? అనంతరం ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా. 
 


విశ్లేషణః

తెలుగులో రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలకు కాలం చెల్లింది. సంక్రాంతికి వచ్చిన, `ధమాఖా`, `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలు పండగ కారణంగా వర్కౌట్‌ అయ్యాయి తప్ప, పరాజయం చెందినవే ఎక్కువ. కామెడీ, ఎమోషన్స్, దానికి తగ్గ బలమైన కథ ఉంటేనే అవి ఆడియెన్స్ ఆదరణ పొందుతున్నాయి. లేదంటే ఆడియెన్స్ నెక్ట్స్ డేకే పక్కన పెట్టేస్తారు. గోపీచంద్‌-శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన `రామబాణం` సైతం రొటీన్‌ రెగ్యూలర్‌, మాస్‌ మాసాలా, కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. అక్కడక్కడ కొంత కామెడీ, బ్రదర్‌ సెంటిమెంట్‌కి కొంత ఎమోషన్స్ ని, పాతకాలం నాటి కథకి కలిపి దానికి రెట్టింపు యాక్షన్‌ జోడించి `రామబాణం` సినిమాని రూపొందించారు. `లక్ష్యం`, `లౌక్యం` చిత్రాలు రెగ్యూలర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్. ఆ టైమ్‌లో అవి వర్కౌట్‌ అయ్యాయి. అదే ఇప్పుడు వర్కౌట్ అవుతుందనుకోవడమే పొరపాటు. ఈ సినిమా విషయంలో దర్శకుడు శ్రీవాస్‌ అదే పొరపాటు చేశాడు.  కథ లేకుండా కొన్ని ఫ్యామిలీ సీన్లు, సెంటిమెంట్లు, యాక్షన్‌, కొన్ని కామెడీసీన్లని నమ్ముకుని ఈ సినిమాని తీశారు. దీంతో ఇది పరమ రొటీన్‌ కమర్షియల్‌ యాక్షన్‌ మూవీగా మారిపోయింది. 
 

ఒకే ఇంట్లో నిజాలు దాస్తూ ఆడే ఫ్యామిలీ డ్రామాలను ఎప్పుడో చూసేశారు మన ఆడియెన్స్. ఆ తర్వాత వాటిని రిజెక్ట్ కూడా చేశారు. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోవడం, పెరిగి పెద్దయ్యాక మళ్లీ ఫ్యామిలీ కష్టాలను తీర్చేందుకు రావడమనేది రొటీన్‌ కాన్సెప్ట్. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడో చూసేశారు. మళ్లీ అవే ఈ సినిమాలో చూపించే సాహసం చేయడం దర్శకుడు శ్రీవాస్‌ ధైర్యానికి మెచ్చుకోవాలి. గోపీచంద్‌ అంగీకరించడాన్ని అభినందించాలి. దీంతో వీరు ఇంకా అప్‌ డేట్‌ కావడం లేదా అనే ఫీలింగ్‌ని కలుగుతుంది. అయితే తమ మార్క్ కామెడీ సీన్లని మాత్రం బాగా ప్లాన్‌ చేశారు. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్‌, అలీ, గోపీచంద్‌ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. సినిమాలో కొంత రిలీఫ్‌నిచ్చే అంశాలు. బ్రదర్స్ సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ రొటీనే అయినా, టచ్చింగ్‌గా ఉంటాయి. పాటలు మరీ ఇరికించినట్టుగానే ఉన్నాయి. పాట లిరిక్‌కి, వాళ్లు ధరించి, షూట్‌ చేసిన లొకేషన్లకి సంబంధమే లేదు. ఫోక్‌ సాంగ్‌కి ట్రెండీ వేర్స్ ధరించి విదేశాల్లో స్టయిల్‌గా డాన్సులు కంపోజ్‌ చేయడం ఆశ్చర్యపరుస్తుంది.
 

ప్రస్తుతం బోయపాటి మార్క్ యాక్షన్‌ సీన్లు బాగా పేలుతున్నాయి. చాలా మంది స్టార్‌ హీరోలు ఇలాంటి మాస్‌, యాక్షన్‌ సీన్లని ఇష్టపడుతున్నారు. దీంతో ఈ చిత్రంలోనూ అలాంటి యాక్షన్‌ సీక్వెన్స్ లు పెట్టారు. అడుగడుగునా ఎలివేషన్లకి ప్రయారిటీ ఇవ్వడం అసహజంగా అనిపిస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఊహించేలా ఉంటాయి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంటుంది. అది ఆడియెన్స్ కి కిక్‌ని మిస్‌ చేస్తుంది. అయితే అన్న కూతురు ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్ అయినప్పుడు గోపీచంద్‌ మార్క్ సెటిల్‌మెంట్‌ వాహ్‌ అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ఫైట్‌, క్లైమాక్స్ లో ఇద్దరు కలిసిపోయే సీన్ బాగుంది. ఖుష్బూ మార్క్ ఎమోషన్‌ సీన్లు హృదయాన్ని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవన్నీ రొటీనే అయినా, ఆ సీన్లలో వాళ్లు జీవించడంతో ఫర్వాలేదనిపిస్తాయి. ఒకటి రెండు ఎలివేషన్లతో కూడిన ట్విస్ట్ లు బాగున్నా, మిగిలినదంతా పరమ రొటీన్‌గా సాగుతుంది. కొత్త సీసాలో పాత అన్నట్టుగా ఉంటుంది. ఇక చివర్లో కల్తీ ఫుడ్‌ గురించి ఇచ్చిన సందేశం పాతదే అయినా ఓకే. 
 

నటీనటులుః

గోపీచంద్‌ మాస్‌,కమర్షియల్‌, యాక్షన్‌ పాత్రలను ఇరగదీస్తాడు. తన స్టయిల్లో ఆయన చేసుకుంటూ వెళ్లాడు. ఎలివేషన్లకి కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టున్నాడు. హీరోయిన్‌ డింపుల్‌ హయాతి గ్లామర్ పరంగా, పాటలతో ఆకట్టుకుంది. రాజారాం పాత్రలో జగపతిబాబు జీవించేశారు. ఖుష్బూ పాత్ర ఇందులో మరో హైలైట్. ఆమె క్లైమాక్స్ సీన్లలో ఇరగదీసింది. నాజర్‌, తరుణ్‌ అరోరా ఓకే అనిపించారు. సత్య, గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌, అలీ, సప్తగిరి నవ్వులు పూయించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 
 

టెక్నీషియన్లుః

సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ కూల్‌ అండ్‌ మెలోడీ ట్రాక్‌లకు కేరాఫ్‌. ఆయన తన మార్క్ ని దాటి మాస్‌ బీట్లు, బీజీఎం ఇచ్చి ఆకట్టుకున్నాడు. వెట్రి పళనిసామి కెమెరా వర్క్ బాగుంది. కొన్ని యాక్షన్‌ సీన్లలో కెమెరా ప్రయోగాలు నవ్వులు పూయిస్తాయి. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రాజీపడకుండా నిర్మించారు. సినిమాలో భూపతిరాజా డైలాగ్‌లు కొన్ని బాగున్నాయి. `కల్తీ లేని ఫుడ్‌, స్వచ్ఛమైన అనుబంధాలు జీవితానికి శ్రీరామరక్ష` అని దర్శకుడు చెప్పిన కన్‌క్లూజన్‌ బాగుంది. ఇక దర్శకుడు శ్రీవాస్‌.. కమర్షియల్‌ సినిమాలకు పెట్టింది పేరు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌ మేళవింపుతో ఆయన సినిమాలు తీస్తారు. `రామబాణం`లోనూ అదే చేశారు. కానీ కథనే ఔట్‌డేటెడ్‌ స్టోరీని ఎంచుకున్నారు. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. బలంగానూ లేదు. దీంతో ఓ పరమ రొటీన్‌ అనే బాణాన్ని ఆడియెన్స్ పైకి వదిలినట్టయ్యింది.

ఫైనల్‌గాః తుప్పుపట్టిన రామబాణం.

రేటింగ్‌ః 2.25

టీనటులు : గోపిచంద్, డింపుల్ హయతి, జగపతి బాబు, నాజర్, ఖుష్బూ, తరుణ్ అరోరా తదితరులు 
కథ : భూపతి రాజా
మాటలు : మధుసూదన్ పడమటి
ఛాయాగ్రహణం : వెట్రి పళనిసామి
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీవాస్
 

Latest Videos

click me!