రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్యాయత్నం గురించి షాకింగ్ విషయాలు

First Published | Nov 30, 2024, 12:14 PM IST

నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు. డబ్బుల్లేక మూడు నెలలు అన్నం తినలేదని, నిర్మాత పుండరీకాక్షయ్య సహాయంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టినట్లు చెప్పారు.

Rajendra Prasad, comedy, allu arjun

ఒకానొక టైమ్ లో కామెడీ సినిమా అంటే రాజేంద్రప్రసాద్. నట కిరీటిగా...నవ్వుల పండిచే హాస్య హీరోగా తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్. ఆయన్ని  కొందరు ఆంద్రా చాప్లిన్‌ అంటారు. నవ్వుల కిరిటి అనీ నవ్వుల రారాజనీ చాలా మంది అంటారు.

అయితే అంత టాలెంట్ ఉన్న ఆయన కెరీర్ ప్రారంభంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని స్వయంగా  రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) తెలిపారు. అవకాశాల్లేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నారు. 


 రాజేంద్ర ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను సైతం అభిమానులుగా మార్చుకున్న  చరిత్ర సాధించిన మేటి నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి.. సీరియస్ పాత్రలలో నటుడిగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకొని.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు రాజేంద్ర ప్రసాద్. 
 



రాజేంద్ర ప్రసాద్ కేవలం హాస్య నటుడే కాదు. అద్భతమైన నటుడు కూడా. అన్ని పాత్రలో ఇట్టే ఒదిగి పోతారు. హాస్య ప్రధాన పాత్రలతో పాటు సందేశాత్మక చిత్రాల్లో రాజేంద్రప్రసాద్ నటించి మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిల్యూట్స్‌లో ఎన్నొ గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్నారు.

ప్రేమ తపస్సు చిత్రంలో అతని నట విశ్వరూపమే చూడొచ్చు. ఎర్రమందారం, ఆ నలుగురు సినిమాకి ఉత్తమ నటుడగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారు.
 


ఇక రీసెంట్ గా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..  కెరీర్‌ ఆరంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) తెలిపారు. అవకాశాల్లేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపారు. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలలు అన్నం తినలేదన్నారు.
 


రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...‘‘మా నాన్న స్కూల్‌ టీచర్‌. చాలా కఠినంగా ఉండేవారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నేను నిర్ణయించుకున్నా. అందుకు ఆయన కాస్త అసహనం వ్యక్తంచేశారు. ‘నీ ఇష్టానికి వెళ్తున్నావు. సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ ఏది వచ్చినా అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిల్‌ అయితే ఇంటికి రావద్దు’ అన్నారు.

ఆయన మాటలు నాపై ప్రభావం చూపాయి. మద్రాస్‌ వచ్చి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. గోల్డ్‌ మెడల్‌ సాధించా. కాకపోతే అవకాశాలు మాత్రం రాలేదు. వేషాలు వచ్చేంత గ్లామర్‌గా లేనని తెలుసు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్లా. ‘రావద్దు అన్నాను కదా ఎందుకు వచ్చావు’ అని నాన్న కోప్పడ్డారు. బాధగా అనిపించి వెంటనే మద్రాస్‌ వచ్చేశా. చనిపోదామనుకున్నా అని చెప్పుకొచ్చారు. 


ఇక నా ఆత్మీయులందరినీ ఒక్కసారి చూడాలనిపించి.. వాళ్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడా. చివరిగా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీస్‌కు వెళ్లా. ‘మేలుకొలుపు’ సినిమాకు సంబంధించి అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. ఆఫీస్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన ఆయన నన్ను చూసి ఏమీ చెప్పకుండా డబ్బింగ్‌ థియేటర్‌కు తీసుకువెళ్లారు.

ఒక సీన్‌కు నాతో డబ్బింగ్‌ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చింది. భలే సమయానికి దొరికావు ప్రసాద్‌ అన్నారు. రెండో సీన్‌కు డబ్బింగ్‌ చెప్పమనగానే.. భోజనం చేసి మూడు నెలలు అయింది. భోజనం పెడితే డబ్బింగ్‌ చెబుతానన్నా. అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పా. దానికి ఆయన కోప్పడ్డారు. 
 


ఇంటికి తీసుకువెళ్లి మంచి భోజనం పెట్టించారు. నాకు ధైర్యం చెప్పారు. అలా నా డబ్బింగ్‌ ప్రయాణం మొదలైంది. ఎన్నో చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పా. అలా వచ్చిన డబ్బుతో మద్రాస్‌లో ఇల్లు కట్టా. అక్కడే నాకు దర్శకుడు వంశీతో పరిచయమైంది. అతడి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా’’ అని రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.  

Latest Videos

click me!