Varanasi Movie : గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి వారణాసి సినిమా కథ వినగానే ఆశ్చర్యపోయానని అన్నారు. ఐదు నిమిషాల్లోనే షాక్ కూడా అయ్యానని చెప్పారు. సినిమాలో తన విలన్ పాత్రపై ప్రత్యేక అనుభవాలను పంచుకున్నారు.
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ శనివారం ఫుల్ జోష్ లో జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ వారాణాసి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచింది. ఈ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇండస్ట్రీలో పాతికేళ్లుగా నటిస్తూ పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పృథ్వీరాజ్, ఇంత అద్భుత స్థాయిలో సినిమా లాంచ్‌ను ఎన్నడూ చూడలేదని తెలిపారు. వేదికపై ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.
24
రాజమౌళి నరేషన్ మొదటి ఐదు నిమిషాల్లోనే పృథ్వీరాజ్ షాక్
పృథ్వీరాజ్ తన స్పీచ్‌లో రాజమౌళి కథ చెప్పిన రోజు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. “సర్ నుంచి మెసేజ్ వచ్చింది.. వెంటనే ఆఫీస్‌కి వెళ్లాను. స్టోరీ చెప్పడం మొదలైన ఐదు నిమిషాల్లోనే నేను షాక్ అయ్యాను. ఆ ఊహ ఎలా వస్తుంది? ఆ విజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అనిపించింది” అని ఆయన తెలిపారు.
అయిదు నిమిషాల్లోనే ‘సర్ నేను ఇదే చేస్తా’ అని ఖచ్చితంగా అనుకున్నానని చెప్పారు. అదే రోజు మూడు గంటలపాటు కథ వింటూ అవాక్కయ్యానని, ఇది జీవితంలో మరువలేని అనుభవమని పేర్కొన్నారు.
34
టార్చరస్ షూటింగ్ కూడా ఆనందమే.. పృథ్వీరాజ్
రాజమౌళి సినిమాల్లో నటులపై శారీరకంగా శ్రమ, భావోద్వేగంగా భారీ ప్రెషర్ ఉంటుందని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ కూడా అంగీకరించారు. “రాజమౌళి సర్ షూటింగ్ చాలా కఠినమైనది. కానీ అదే కఠినత ఈ సినిమా గొప్పతనాన్ని నిరూపిస్తుంది. ఎంత శ్రమపడితే అంత మంచి పని వస్తుంది. అలాంటి దర్శకుడి నమ్మకాన్ని పొందడం నాకు పెద్ద గౌరవం” అని అన్నారు.
పృథ్వీరాజ్ పోషిస్తున్న పాత్ర ప్రధాన ప్రతినాయకుడిగా ఉండబోతోంది. అతని క్యారెక్టర్ సినిమాలోని అత్యంత బలమైన ఎమోషనల్, శారీరక పరీక్షలతో కూడి ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఈవెంట్ సందర్భంలో మేకర్స్ ‘కుంభ’ అనే ప్రత్యేక పాటను విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి అందించిన ఈ మ్యూజిక్, పృథ్వీరాజ్ నటించిన భయంకర విలన్ పాత్రను మరింత హైలైట్ చేస్తోంది. పాటలోని గ్రావిటీ, విజువల్స్, థ్రిల్లింగ్ స్కోర్ అభిమానుల్లో భారీ అంచనాలు కలిగించాయి. పాట విడుదలైన తర్వాత, తన పాత్రకు ఇంత బలమైన సంగీతాన్ని అందించినందుకు కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు.
మహేష్, ప్రియాంక చోప్రా, రాజమౌళి.. వేదిక అదిరిపోయింది
ఈవెంట్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హాజరై మరింత గ్లామర్ తెచ్చారు. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, “ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. మహేష్ బాబు, రాజమౌళిలు ఇచ్చిన ఆదరాభిమానాలు కుటుంబం లాగా అనిపించాయి” అని చెప్పారు. పృథ్వీరాజ్ కూడా మహేష్ బాబు గురించి మాట్లాడారు. “నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా పోకిరి. అప్పటి నుంచి మీ లెగసీ పెరుగుతూ వచ్చింది. ఈ సినిమా మీకు కెరీర్ లో మరో గొప్ప మైలురాయిగా నిలుస్తుంది” అని అన్నారు.