
మాట వినాలి పాట రికార్డ్ వ్యూస్..
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ హిస్టారికల్ మూవీ `హరిహర వీరమల్లు` నుంచి మొదటి పాట విడుదలైంది. పవన్ కళ్యాణ్ పాడిన `మాట వినాలి` పాట శుక్రవారం విడుదల కాగా, ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది. అంతేకాదు ఏకంగా 25మిలియన్స్ వ్యూస్ ని సాధించింది. ఈ పాటకి కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్.
`దిల్ రూబా` నుంచి ఫస్ట్ సాంగ్..
`క` మూవీతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు `దిల్‌రూబా` చిత్రంతో వస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు `దిల్ రూబా" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'అగ్గిపుల్లె..' రిలీజ్ చేశారు మేకర్స్. `అగ్గిపుల్లె అలా గీసినట్టు, కోపంగా చూడకే కొట్టినట్టు, గాలి దుమారమే రేగినట్టు, ఆవేశమెందుకే నొక్కిపెట్టు...' అంటూ బ్యూటిఫుల్ మెలొడీతో సాగుతుందీ పాట.
కిరణ్ అబ్బవరం, సామ్ సీఎస్ కాంబినేషన్ లో వచ్చిన "క" మూవీ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో "దిల్ రూబా" ఆడియో మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్ డేట్..
బ్లాక్ బస్టర్ చిత్రం `మ్యాడ్` కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్` ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన `లడ్డు గానీ పెళ్లి`, `స్వాతి రెడ్డి` పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. `మ్యాడ్ స్క్వేర్ `చిత్రాన్ని 2025 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా `మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్` అని నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య పేర్కొన్నారు. ఈ మూవీకి కళ్యాణ్ శంకర్ దర్శకుడు. ఇందులో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటిస్తున్నారు.
నితిన్ `రాబిన్‌హుడ్` రిలీజ్ డేట్..
నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా `రాబిన్‌హుడ్` చిత్రం రూపొందుతుంది. కేతిక శర్మ మరో హీరోయిన్‌గా మెరవబోతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ డేట్ ఇచ్చింది యూనిట్. మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కేతికా శర్మ నటించిన సెకండ్ సింగిల్ కొన్ని రోజుల్లో విడుదల కానుంది, ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ , మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
ధనుష్ రూపొందించిన `జాబిలమ్మ నీకు అంత కోపమా’ రిలీజ్ డేట్..
ధనుష్ హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు. దర్శకుడిగానూ `పాపాండి`, `రాయన్` చిత్రాలు చేశారు. తాజాగా ఆయన దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది. దీనికి తెలుగులో `జాబిలమ్మ నీకు అంత కోపమా` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆర్.కె.ప్రొడక్షన్స్‌తో కలిసి ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
2018లో విడుదలైన `మారి2` తర్వాత ధనుష్ నిర్మిస్తోన్న సినిమా ఇది. రొమాంటిక్ కామెడీ కథను ధనుష్ రాయటం విశేషం. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలవుతుంది. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు.