ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులను ఉద్దేశించి తాజాగా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘ఆయన్ని ఇబ్బంది పెట్టకండి’ అని పేర్కొంటూ చిరు విన్నపం చేసింది. ‘‘ఓజీ’పై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం.
కానీ, పవన్‌కల్యాణ్ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, ఆయన్ని ఇబ్బందిపెట్టడం సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యత. కాబట్టి కొన్ని రోజులు ఓపికగా ఎదురుచూద్దాం. 2025.. ఓజీ పండుగ ఘనంగా జరగనుందని మేము గట్టిగా నమ్ముతున్నాం’’ అని పేర్కొంది. అంతేకాకుండా ఈ చిత్రంతో థియేటర్లలో అల్లాడిద్దామని అభిమానులకు తెలిపింది.