`పరేషాన్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published Jun 2, 2023, 8:06 AM IST

తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇటీవల కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా `పరేషాన్‌` పేరుతో మరో సినిమా వచ్చింది. తిరువీర్‌ మెయిన్‌ రోల్‌లో నటించగా, దీన్ని రానా సమర్పించారు. నేడు రిలీజ్‌ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

తెలంగాణ నేపథ్యంలో ఇప్పుడు వరుసగా సినిమాలొస్తున్నాయి. `ఫిదా` నుంచి `లవ్‌ స్టోరీ`, `దసరా`, `బలగం`, `జాతిరత్నాలు`, ఇటీవల `మేమ్‌ ఫేమస్‌` చిత్రాలు హిట్‌ కావడంతో ఇదిప్పుడు హిట్‌ ఫార్ములాగా మారిపోయింది. తెలంగాణ రూట్ లెవల్‌లోకి వెళ్లి చేసిన `బలగం` చిత్రం సంచలన విజయం సాధించింది. ఇది ఎన్నో సినిమాలకు ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు వరుసగా అలాంటి చిత్రాలే వస్తున్నాయి. అయితే రాను రాను తెలంగాణ కల్చర్‌ని పెడదోవ పట్టించేలా సినిమాలొస్తుండటం గమనార్హం. తెలంగాణ అంటే తాగుడుకి బ్రాండ్‌ అంబాసిడర్‌లా చూపిస్తున్నారు యంగ్ మేకర్స్. తాజాగా `పరేషాన్‌` చిత్రం సైతం తెలంగాణ నేపథ్యంలోనే రూపొందింది. రోనాల్డ్ రూపక్‌ సన్‌ దర్శకత్వం వహించారు. `మసూద` ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించగా, హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి  ఈ శుక్రవారం(జూన్‌ 2) విడుదలైన `పరేషాన్‌` చిత్రం ఎలా ఉంది? ఇందులోనూ తాగుడే చూపించారా? అంతకు మించి ఇంకేమైనా చూపించారా? అనేది చూస్తే.. 
 

కథః
ఐజాక్‌(తిరువీర్‌) ఐటీఐ ఫెయిల్‌ అయి పనీపాట లేకుండా ఫ్రెండ్స్ తో బలాదూర్‌ తిరుగుతుంటాడు. తాగుడు, కోట్లాటలే పని. దీంతో తండ్రి సమర్పణం(మురళీధర్‌ గౌడ్‌) తన సింగరేణి ఉద్యోగం కొడుక్కి ఇప్పించి లైఫ్‌లో సెటిల్‌ చేయాలనుకుంటాడు. అందుకు తన భార్య బంగారు గాజులు అమ్మి వచ్చిన డబ్బుని కొడుక్కి ఉద్యోగం కోసం పైరవీకి లంచం ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ డబ్బును ఆపదలో ఉన్న ఫ్రెండ్స్ కి ఇస్తాడు ఐజాక్‌. దీంతో ఓ వైపు డబ్బులు ఏం చేశావని ఇంట్లో తండ్రి నుంచి గోల. రోజూ ఇంట్లో పంచాయితీ. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీష(పావని కరణం)తో ఒక్కసారి కలవడంతో గర్భవతి అవుతుంది. ఆమె అబార్షన్‌ చేయించేందుకు డబ్బులు రెడీ చేస్తే ఆ పైసలు ఫ్రెండ్‌ కొట్టేస్తాడు. దీంతో డబ్బుల కోసం పరేషాన్‌ అవుతుంటాడు ఐజాక్‌. మరి ఆ డబ్బులు వచ్చాయా? తన లవర్‌ అబార్షన్‌ చేయించాడా? తన డబ్బులను ఎవరు కొట్టేశారు? ఈ క్రమంలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది సినిమా మిగిలిన కథ.
 

విశ్లేషణః
తెలంగాణ కల్చర్‌ ఇన్నాళ్లు వెండితెరపైకి రాలేదు. ఒకటి అర వచ్చినా, అవి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే తెలంగాణలోని రూట్‌లెవల్‌లోకి వెళ్లి సినిమా చేస్తే ఇక్కడి ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇటీవల ఆడిన సినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే రాను రాను దాన్ని పెడదోవ పట్టిస్తుండటం బాధాకరం. తెలంగాణ అంటే `తాగుడు`, పొరగాళ్ల కొట్లాటలే అనేలా సినిమాలు తీస్తుండటం అత్యంత బాధాకరం. అయితే అత్యంత సహజంగా ఆ కల్చర్‌ని, పరిస్థితులను చూపించడం అభినందనీయమే, కానీ దాని పేరుతో తాగుడికి బానిసలుగా చూపించడం వెగటు పుట్టిస్తుంది. `పరేషాన్‌` చిత్రంలో అదే చేశారు. ప్రతి సీన్‌లోనూ తాగుడు, ఆనందమేస్తే తాగుడు, బాధేస్తే తాగుడు, కష్టమొస్తే తాగుడు, ఏం చేయాలన్నా ఫస్ట్ తాగుడు. సినిమాలో 80శాతం మందు బాటిల్‌, బీర్‌ బాటిల్‌ ఉన్న సీన్లుతోనే సాగుతుందంటే అతిశయోక్తి కాదు. సినిమా చూస్తే తాగే ఆలవాటున్న వాళ్లకి కూడా వెగటు పుట్టించేలా ఉంది. తెలంగాణ కల్చర్ ని వాస్తవం అనే పేరుతో దిగజార్చి చూపించి, మన పరువు మనమే తీసుకుంటున్నట్టుగా ఉంది. 
 

తాగుడు అంశం పక్కన పెడితే `పరేషాన్‌` మంచి ప్రయత్నంగా చెప్పాలి. రెగ్యూలర్‌ కమర్షియల్‌ మీటర్ కి అతీతంగా తీసిన సినిమా. పల్లెటూర్లో పోరగాళ్లు ఎలా అయితే ఆగం ఆగంగా ఉంటారో, ఏమనిపిస్తే అది చేస్తారో, సినిమాని కూడా అలానే తీశారు దర్శకుడు రూపక్‌. సినిమా ప్రధానంగా మంచిర్యాల నేపథ్యంలో సాగుతుంది. అక్కడ ఎక్కువగా బొగ్గు గని కార్మికులుంటారు. అందులో పనిచేసే క్రమంలో మందు తీసుకుంటారు. యూత్‌ సైతం ఎక్కువగా తాగుడుకి ప్రయారిటీ ఇస్తారు. కాకపోతే అవి కొన్ని సీన్లకి పరిమితం చేయోచ్చు. కానీ దర్శకుడు వాస్తవంగా అలానే చేస్తారని చెప్పి, అదొక వ్యవసంలా, అదే జీవితంలా చూపించడమే ఈ సినిమాలో సగటు ఆడియెన్‌ జీర్ణించుకోలేని విధంగా ఉంటుంది. సినిమా ప్రధానంగా యూత్‌ని టార్గెట్‌ చేసి తీసింది. తెలంగాణలోని యూత్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. అందులోనూ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఊర్లలో ఇలానే జరగదు. దీంతో అది కొందరికి నచ్చకపోవచ్చు కూడా. 

కాకపోతే `పరేషాన్‌` రెగ్యూలర్‌ సినిమా బారియర్స్ ని బ్రేక్‌ చేసిన చిత్రం. సినిమాలో పరేషాన్‌లాగే సినిమా సాగే తీరు కూడా పరేషాన్‌ లాగా ఉంటుంది. డబ్బుల కోసం హీరో పరేషాన్‌ అవుతుంటాడు. అయితే ఆ డబ్బుల కోసం పడే పాట్లు పెడదారి పట్టాయి. సంబంధం లేని సీన్లు వచ్చీపోతుంటాయి. కథ లక్ష్యం రాంగ్‌ ట్రాక్‌ ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్‌లతో సంబంధమే లేదు. సీన్‌ బై సీన్‌ చేసుకుంటూ వెళ్లారు. ఫన్‌ కోసం ప్రయత్నం చేశారు తప్పితే, స్క్రీన్‌ ప్లే కి ఓ ఫ్లో ఉండదు. సినిమాలో ప్రధాన పాత్రల మధ్య వచ్చే పరేషాన్‌ ఆడియెన్స్ కి నవ్వులు తెప్పిస్తుంది. ఓ జెన్యూన్‌ కామెడీని ఎంజాయ్‌ చేయోచ్చు. సినిమాలో కొట్లాడుకుంటుంటే, థియేటర్లలో ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తుంటాయి. కుర్రాళ్లు డబ్బుల కోసం ఇబ్బంది పడటం, పెళ్లిళ్లలో ఎంజాయ్‌ చేసే తీరు, కష్టమొస్తే అండగా ఉండే తీరు, బలాదూర్‌ తిరిగితే ఇంట్లో పెద్దోళ్ల ధమ్‌ ధమ్‌ చేయడం, లవర్‌తో రచ్చ, లవర్ల కోసం కోట్లాటలు ఇలాంటి సీన్లని వాస్తవానికి దగ్గరగా, అందరికి కనెక్ట్ అయ్యేలా ఉండటం సినిమాకి పెద్ద హైలైట్. తెలంగాణ డైలాగ్‌లు, పంచ్‌లు మరో హైలైట్‌. అదే సమయంలో అనవసరమైన సీన్లు, చిరాకు తెప్పించే సీన్లు కూడా బోలెడు ఉంటాయి. కొంత ఫన్ ఎంజాయ్‌ చేస్తే అంతే మోతాదులో ఇరిటేషన్‌ని కూడా భరించాలనేట్టుగా సినిమా ఉంది. 
 

నటీనటులుః

ఐజాక్‌ పాత్రలో తిరువీర్‌ చాలా బాగా చేశాడు. చాలా సహజంగా చేశాడు. అతని పాత్రని చాలా మంది కుర్రాళ్లు రిలేట్‌ అవుతారు. అతనే కాదు అతనితో ఉన్న ఆర్జీవీ పాత్ర, మైదాక్‌, సత్తి(అర్జున్ కృష్ణ) వీళ్లంతా చాలా సహజంగా నటించారు. వారు పడే బాధలు థియేటర్లలో నవ్వులు పూయించేలా ఉంటాయి. ముఖ్యంగా సత్తి పాత్ర మరో హైలైట్‌గా చెప్పొచ్చు. ఇటీవల మురళీధర్‌ గౌడ్‌ తండ్రి పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఇందులోనూ అదరగొట్టారు. శిరీష పాత్రలో పావని చాలా బాగా చేసింది. బన్నీ అభిరామ్‌, సాయి ప్రసన్న, పద్మ, వసంత ఇలా అందరు సహజంగా నటించారు. అక్కడక్కడ అనుభవ లేమి కనిపిస్తుంది. సినిమాలో చాలా వరకు కొత్తవాళ్లే ఉన్నారు. సినిమా కోసం వాళ్లు ప్రాణం పెట్టారు. వారిని అభినందించాల్సిందే, ఎంకరేజ్‌ చేయాల్సిన అవసరం ఉంది.
 

టెక్నీషియన్లుః 

దర్శకుడు రూపక్‌ రోనాల్డ్ సన్‌ దీన్ని ఒక కమర్షియల్‌ సినిమాలా కాకుండా పారలల్‌ మూవీగా తెరకెక్కించారని చెప్పొచ్చు. మేకింగ్‌కి సంబంధించిన అన్ని బారియర్స్ ని బ్రేక్‌ చేశాడు. సినిమా తీయడంలో హద్దులు చెరిపేశారు. ఎలా అయినా తీయోచ్చని నిరూపించారు. అదే సమయంలో సినిమా స్క్రీన్‌ప్లే లో క్లారిటీ లేదు. ఏది పడితే అది తీసి జనం మీదకు వదిలినట్టుగా, ఏదో చుట్టేసినట్టుగా ఉంది. ఆయన చేసిన అటెంప్ట్ జెన్యూన్‌గా ఉంది. కానీ మేకింగ్‌లో ఆ సిన్సియారిటీ కనిపించలేదు. నాకు నచ్చింది తీస్తా, చూస్తే చూడండి అనేట్టుగా సినిమాలోని సీన్లు ఉండటం గమనార్హం. సీన్లు మరింత క్వాలిటీగా రాసుకుని మేకింగ్‌ పరంగా కేర్‌ తీసుకుంటే బాగుండేది. వాసు పెండమ్‌ కెమెరా వర్క్ ఉన్నంతలో బాగుంది. చాలా వరకు సీన్లలో సహజత్వం కనిపిస్తుందంటే అది కెమెరామెన్‌ పనితనం వల్లే అని చెప్పొచ్చు. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకుంటే బాగుండేది. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం ఉన్నంతలో బాగుంది. అయితే బీజీఎం సినిమా లాగే పరేషాన్‌ చేసేలా ఉంటుంది. కొన్ని చోట్ల ఓవర్‌ డోస్‌ అనిపిస్తుంది. కొన్ని చోట్ల గందరగోళం అనిపిస్తుంది. చాలా వరకు కథకి యాప్ట్ గా నిలుస్తుంది. నిర్మాణం పరంగా క్వాలిటీ లేదు. ఏదో ప్రయోగం లాగా చేద్దాం, ఎక్కువ బడ్జెట్‌ అయితే జనం చూస్తారో లేదో అని ముందే అనుకున్నారేమో, చూట్టేశారు. 
 

ఫైనల్‌గాః `పరేషాన్‌` ఒక యూత్‌ఫుల్‌ మూవీ. ఒక సిన్సియర్ అటెంప్ట్. ఫన్‌ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. అదే సమయంలో ఆడియెన్స్ కి కొంత పరేషాన్‌ తెప్పిస్తుంది. వీటన్నింటికి తోడు శృతిమించిన తాగుడు వెగటు పుట్టిస్తుంది.

రేటింగ్‌ః 2.5

నటీనటులు : తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత తదితరులు.
కెమెరామెన్‌ : వాసు పెండమ్
మ్యూజిక్‌: యశ్వంత్ నాగ్
సమర్పణ : రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్)
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి  
రచన, దర్శకత్వం : రూపక్ రోనాల్డ్ సన్‌.
 

click me!