యంగ్ హీరో నితిన్ కి ఇటీవల రాబిన్ హుడ్ చిత్రం తో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నితిన్ ఆశలు పెట్టుకున్నంతగా ఈ చిత్రం ఆడలేదు. వాస్తవానికి రాబిన్ హుడ్ బ్యాడ్ మూవీ ఏమీ కాదు. కానీ వర్కౌట్ కాలేదు అంతే. ఇప్పుడు నితిన్ ఫోకస్ తన నెక్స్ట్ మూవీ తమ్ముడుపై మళ్లింది. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే.
దీనితో నితిన్ తమ్ముడు చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. రాబిన్ హుడ్ ప్రచార కార్యక్రమాల సమయంలో తమ్ముడు చిత్రం గురించి నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు మూవీ రేంజ్ వేరు అని నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అని తెలిపాడు. రాబిన్ హుడ్ చిత్రంతో నితిన్ మార్కెట్ కి చాలా డ్యామేజ్ జరిగింది.
ఈ డ్యామేజ్ ని సరిచేసుకోవాలంటే అర్జెంట్ గా హిట్ కావాలి. అందుకే తమ్ముడు చిత్రాన్ని వీలైనంత త్వరగా దించాలని నితిన్ భావిస్తున్నాడు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారు.
తాజాగా తమ్ముడు చిత్రానికి రిలీజ్ డేట్ దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇదే డేట్ కంఫర్మ్ అని త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.
జూలై 4 మంచి రిలీజ్ డేట్, తమ్ముడు చిత్ర యూనిట్ తెలివిగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. అదే నెలలో 24న చిరంజీవి విశ్వంభర రిలీజ్ అవుతోంది. 18న రవితేజ మాస్ జాతర ఉంటుంది. ఆ చిత్రాలతో పోటీ పడకుండా మూడు వారాల ముందే రావాలని నిర్ణయించుకోవడం సరైన నిర్ణయం అని అంటున్నారు. మరి ఈ చిత్రంతో అయినా నితిన్ తన పరాజయాలకు బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి.