
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున, నాగవంశీ నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. దాదాపు పది కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్ సైట్లు వెల్లడించగా, రూ.16.7కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు.
`లెనిన్` సక్సెస్ సెలబ్రేషన్‌లో నాగార్జున పాల్గొన్నారు. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం సక్సెస్ సెలబ్రేషన్ సమయంలోనే కొడుకు అఖిల్‌ని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు శనివారం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ సైతం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని సినిమా సక్సెస్ కావాలని కోరుకోలేదని, ఈ మూవీ రిలీజ్‌కి ముందు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని, ఆ సమయంలోనే అఖిల్ కి ఒక్క హిట్ ఇవ్వండి స్వామి అని వేడుకున్నాడట. ఇప్పుడు కోరుకున్నట్టుగానే అఖిల్‌కి హిట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలిపారు నాగార్జున. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తనకు హిట్ ఇవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందట. ఇద్దరికీ హిట్ వచ్చిందని చెప్పాడు నాగ్.
ఇక లెనిన్ ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మూవీకి సపోర్ట్ చేసిన తారక్‌కి ధన్యావాదాలు తెలిపారు. తన పెద్దబ్బాయి తారక్ అని చెప్పాడు నాగ్. ఈ కథ గురించి సరైన వాయిస్‌తో చెప్పాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ బెస్ట్ అని అంతా అన్నారు. అడగ్గానే తాను వచ్చి వాయిస్ ఇచ్చి సినిమాపై అంచనాలను పెంచారు, అదే సమయంలో ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా టీమ్ అందరికి ధన్యవాదాలు తెలిపారు నాగార్జున.
అఖిల్ గురించి చెబుతూ, అఖిల్ చిన్నప్పట్నుంచి ఎనర్జిటిక్ అని, చాలా ఎక్కువ ఎనర్జీ ఉందని, అతన్ని అప్పుడప్పుడు భూమిపై పడుకోబెట్టండి, ఆ ఎనర్జీ భూమిలోకి వెళ్తుందని చెప్పాడు, అమల అప్పుడప్పుడు అదే చేసేది. చిన్నప్పట్నుంచి సాధించాలనే తపని అతనిలో చూశాను. అంత ఎనర్జీ ఉంది, గోల్ వరకు వెళ్తున్నాడు, కానీ కొట్టలేకపోతున్నాడు. ప్రతి సినిమాకి చాలా కష్టపడ్డాడు, అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడ్డాడు, పదే పదే ఇదే జరుగుతుంది. ఇంట్లో బాధపడుతుండేవాడు. ఏది బయటకు చెప్పడు, ఇంట్లో అది నేను బాగా చూస్తుండేవాడిని. ఈ క్రమంలో జరిగిన ఒక ప్రమాదంలో చెతికి గ్లాస్ కోసుకుపోయి చాలా పెద్ద గాయమైంది. చేతి సెట్ అవుతుందా లేదా అనే ప్రశ్న ఉండేది. ఆరు నెలలు ఎంతో అనుభవించాడు. చేయి పనిచేస్తుందా లేదా అనే డౌట్ ఉండేది, అది మాకు అత్యంత భయంకరమైన టైమ్. నాకు, అమలకి, బయటకు చెప్పుకోలేము.
ఆరు నెలలు ఫిజియోథెరఫీ చేయించాము, నెమ్మదిగా సెట్ అయ్యింది. ఆ తర్వాత ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ కమ్ బ్యాక్ తర్వాత తను చాలా మారిపోయాడు, చాలా కామ్ అయ్యాడు, కామ్‌గా ఆలోచించడం మొదలు పెట్టాడు, ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు చాలా జరిగాయి. ఆ సమయంలోనే పెళ్లైంది, తోడు వచ్చింది. కామన్ నెస్, తోడు ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. ఇప్పుడు మంచి టైమ్ స్టార్ట్ అయ్యింది. `లెనిన్` మూవీని అలానే ఆలోచించి చేశాడు, హిట్ కొట్టాడు. ఇలానే మున్ముందు ఉంటే అఖిల్‌కి మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ మూవీకి ఇంత రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విజయంలో భాగమైన అభిమానులకు ధన్యవాదాలు. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మా వెంట ఉన్నారు. హిట్ కావాలని వారే ఎక్కువగా కోరుకున్నారు. వారికి రుణపడి ఉంటాం, ఇంతగా సపోర్ట్ చేసిన మీడియాకి థ్యాంక్స్` అని చెప్పాడు నాగార్జున.