
ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రూపొందిన సినిమా `ఆర్‌ఆర్‌ఆర్`. పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు రాజమౌళి రూపొందించారు. ఈ సినిమాని దాదాపు పది ఇండియన్ లాంగ్వేజెస్‌లో విడుదల చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. అంతేకాదు పదివేలకుపైగా థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్టు సమాచారం. దీంతో సినిమా కోసం కోట్లాది మంది ఆడియెన్స్ ఎంతో ఆతృతతో ఉన్నారు. ఈ విజువల్ వండర్‌ని థియేటర్‌లో తిలకించేందుకు వెయిట్ చేస్తున్నారు.
కానీ కన్నడనాట మాత్రం `ఆర్‌ఆర్‌ఆర్`కి పెద్ద షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని కన్న సినీ అభిమానులు మాత్రం ఉన్నట్టుండి వ్యతిరేకిస్తుండటం సంచలనంగా మారింది. #BoycottRRRinKarnataka అనే యాష్ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు కన్నడ సినీ అభిమానులు. తాము ఈ సినిమాని చూసేది లేదని తేల్చి చెబుతున్నారు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమని మోసం చేశారని, అంతేకాదు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కిచ్చిన మాటమీద నిలబడలేదంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు దుమారం రేపుతుంది. మరి కన్నడ అభిమానులు అంతగా ఫైర్ అవ్వడానికి కారణమేంటనేది చూస్తే.
ఈ సినిమాని కన్నడ వెర్షన్‌లో విడుదల చేయడం లేదట. తెలుగు, తమిళం, హిందీ వెర్షన్‌లోనే విడుదల చేస్తున్నారట. బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లోకి వెళితే అందులో కన్నడ లాంగ్వేజ్ లేకపోవడంతో అ అభిమానులు ఖంగుతింటున్నారు. కన్నడ భాషలో సినిమా లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు సినిమాని కన్నడ భాషలో రిలీజ్ చేయకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లు మీ సినిమాలను ఆదరించామని, కానీ ఇంకా దాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా అంటే మాకు ఇష్టమని, కానీ కన్నడ భాషలోనే ఆ సినిమాని చూడాలనుకుంటున్నామని వారు చెబుతున్నారు. కన్నడ డబ్ వెర్షన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ విడుదల చేస్తున్న కేవీపీ డిస్ట్రిబ్యూషన్ సంస్థని ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఇటీవల కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్‌పైనే శివరాజ్‌కుమార్ కన్నడ భాషలో ఈ సినిమాని విడుదల చేయాలని కోరారు. కానీ ఆయన మాటని వమ్ము చేశారని, మాట మీద నిలబడలేదని వారు కామెంట్ చేస్తున్నారు. రాజమౌళిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే `#BoycottRRRinKarnataka` యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
అంతేకాదు పునీత్ రాజ్‌కుమార్ సినిమాకి అన్యాయం చేస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం `జేమ్స్` గత వారం విడుదలైంది. ప్రస్తుతం ఇది థియేటర్‌లో రన్ అవుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` కోసం రెండు మూడు థియేటర్లు తప్ప మిగిలిన అన్ని చోట్ల తీసేస్తున్నారు. దీంతో పునీత్ అభిమానులు మండిపడుతున్నారు. `జేమ్స్`ని కదిపేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే దీనిపై తెలుగు ఫ్యాన్స్ సైతం స్పందిస్తున్నారు. తమ సినిమాని బైకాట్ చేస్తే మీ సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతున్నాయంటున్నారు. త్వరలో `కేజీఎఫ్ 2` రిలీజ్ కాబోతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు. మొత్తంగా తెలుగు, కన్నడ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఓ యుద్ధమే జరుగుతుంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌పడుతుందో చూడాలి.
`ఆర్‌ఆర్‌ఆర్`లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించగా ఈ మల్టీస్టారర్ చిత్రం సుమారు రూ. 480కోట్లతో రూపొందింది. భారీ స్థాయిలో ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో సినిమాని జనంలోకి తీసుకెళ్లేందుకు దేశ వ్యాప్తంగా ప్రచారాలు చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళీ.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి ఇప్పటికే ఆయన దుబాయ్, కర్నాటక, ఢిల్లీ, జైపూర్, వారణాసి, కోల్‌కతా వంటి సిటీలను కవర్ చేశారు. బుధవారం వరకు ప్రమోషన్‌లో పాల్గొనబోతున్నారు.