దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా `ఫంకీ` మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో చూస్తుంటే విశ్వక్ సేన్‌ని అనుదీప్ బాగా సానాబెట్టాడనిపిస్తోంది.
దర్శకుడు అనుదీప్ `జాతిరత్నాలు` మూవీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. టాలీవుడ్‌లో ఒక విభిన్నమైన కామెడీ సినిమాని రూపొందించి ఆకట్టుకున్నాడు. డైలాగ్ లతో కామెడీని పండించి, హిట్ కొట్టాడు. అంతేకాదు ఇప్పుడు వస్తోన్న అనేక కామెడీ చిత్రాలకు `జాతిరత్నాలు` మూవీని ఆదర్శంగా నిలిపారు. అయితే మధ్యలో తన పంథాని దాటి `ప్రిన్స్` చిత్రంతో కొత్తగా ప్రయత్నించాడు. కానీ ఆ మూవీ ఆడలేదు. అనుదీప్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పుడు కొంత గ్యాప్‌తో తన స్టయిల్ కామెడీ మూవీతో వస్తున్నారు. తాజాగా అనుదీప్ `ఫంకీ` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించడం విశేషం. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర టీజర్ తాజాగా శనివారం విడుదలైంది. ఇది ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.
24
విశ్వక్ సేన్‌ని తన దారికి తెచ్చుకున్న అనుదీప్
అయితే సాధారణంగా విశ్వక్ సేన్ మూవీ అంటే మాస్, యాక్షన్‌తో ఉంటుంది. భారీ డైలాగ్‌లుంటాయి. మాస్ కా దాస్ మార్క్ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ఇందులో అవేవీ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే విశ్వక్ సేన్‌ని అనుదీప్ తన దారికి తెచ్చుకున్నాడనిపిస్తోంది. తన మార్క్ కామెడీ స్టయిల్‌కి విశ్వక్‌ని మౌల్డ్ చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తాజాగా విడుదలైన టీజర్‌లో విశ్వక్ సేన్ తన మార్క్ బాడీ లాంగ్వేజ్‌ని ప్రజెంట్ చేస్తూనే అందులో ఓవర్ బోర్డ్ పోకుండా దాన్ని కామెడీగా మలచడం విశేషం. అనుదీప్ మార్క్ పంచ్ డైలాగ్‌ల కామెడీకి, విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ తోడు కావడంతో `ఫంకీ` టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించింది.
34
పంచ్ డైలాగ్‌లతో ఆద్యంతం కామెడీగా `ఫంకీ`టీజర్
ఇందులో విశ్వక్ సేన్ ఫిల్మ్ డైరెక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఓ స్కూల్ ఈవెంట్‌లో విశ్వక్ మాట్లాడుతూ, ఈ స్కూల్‌లో చదువుకోవడం వల్లే ఫెయిల్ అయ్యానని, బాగా చదువుకోకపోవడం వల్లే సినిమాల్లోకి వెళ్లానని, డైరెక్టర్ అయ్యానని చెప్పడం అందరికి షాకిస్తుంది. నవ్వులు పూయిస్తుంది. అంతేకాదు కాలేజీలో ఎవరినైనా లవ్ చేశార్రా అని విశ్వక్ అడగ్గా, తన అసిస్టెంట్‌లో ఒకరు `కావ్యని లవ్ చేశాన`ని చెప్పాడు. మరో అసిస్టెంట్ `అమ్మని లవ్ చేస్తున్నా` అని చెప్పగా, విశ్వక్.. `కావ్య వాళ్ల అమ్మని ప్రేమిస్తున్నావా` అని పంచ్ వేయడం దిమ్మతిరిగిపోయింది. ఇలా టీజర్ మొత్తం వరుసగా పంచ్ డైలాగ్‌లతో సాగింది. అక్క, బావకి సంబంధించిన కామెడీ కూడా అదిరిపోయింది. చివర్లో ఓ యాక్షన్ సీన్ చూపించి, `అరేయ్ నేను ఇక్కడ లేనంత వరకేరా ఇక్కడ లేను. ఒక్కసారి వచ్చానంటే నేను ఇక్కడే ఉన్నట్టు` అని విశ్వక్ చెప్పడం క్రేజీగా ఉంది. ఇలా ఆద్యంతం పంచ్ డైలాగ్‌లో సాగే ఈ టీజర్ నవ్వులు పూయించింది. అనుదీప్ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఓ రకంగా అనుదీప్ తనలోని మరో వెర్షన్ చూపించబోతున్నాడని చెప్పొచ్చు.
అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరంతా ఉండటంతో సినిమా నవ్వుల సునామీలా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుందని సమాచారం.