‘బద్రి’, ‘జానీ’ చిత్రాలతో రేణు దేశాయి (Renu Desai) హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అటు తమిళంలో ‘జేమ్స్ పండు’ అనే ఓ చిత్రం చేసింది. మొత్తం మూడు సినిమాల్లో మెరిసి నటనకు గుడ్ బై చెప్పింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి వెండితెరపై మెరియబోతోంది. తాజాగా రేణు దేశాయి నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageswara Rao).
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టూవర్టుపురం గజదొంగగా అలరించబోతున్నారు. నిజజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఈ క్రమంలో రేణుదేశాయి నటించే పాత్ర కూడా ఆసక్తిని పెంచుతోంది.
‘హేమలత లవణం’ అనే పాత్రలో రేణు దేశాయి అలరించబోతుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అసలు Hemalatha Lavanam ఎవరనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఇంతకీ ఆమె ఎవరనే విషయానికొస్తే..
ప్రముఖ రచయిత గుర్రం జాషువా కూతురే హేమలత లవణం. ఆమె ఒక సంఘసంస్కర్త. తండ్రి బాటలోనే నడిచి రచయితగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న జాతి వివక్ష, అంటరానితనం అనే అంశాలపై తన జీవితం మొత్తం పోరాడారు. ఈ క్రమంలోనే 19వ దశకంలో తన భర్తతో కలిసి నేరస్తుల్లో మార్పు తెచ్చేందుకు పనిచేశారు.
అదే సమయంలో హేమలత స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావును కలిసినట్టు సమాచారం. ఆ తర్వాత ఏమైంది. నాగేశ్వర రావుపై హేమలత లవణం చూపిన ప్రభావం ఏమేరకు ఉందనేది సినిమాలో చూపించబోతున్నారు. దీంతో రేణు దేశాయి నటించిన ఈ పాత్ర సినిమాకే కీలకమని తెలుస్తోంది.
రెండు దశాబ్దాల తర్వాత రేణు దేశాయి రీఎంట్రీ ఇవ్వనుండటం.. అందులోనూ పవర్ ఫుల్ లేడీ పాత్రను పోషిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అభిమానులు మూవీకోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరగనుంది.