
బిగ్ బాస్ 7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని అదరగొట్టాడు నటుడు శివాజీ. హౌజ్‌లో పెద్దగా వ్యవహరించాడు. శివన్నగా పేరు తెచ్చుకున్నాడు. అందరికి పెద్ద దిక్కుగా నిలిచాడు. ముఖ్యంగా ఛాణక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన ఆట తీరుతో ఇతరులను ఓడించడంలో సక్సెస్ అయ్యాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మెప్పించాడు. బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా తనకు రావాల్సిన గుర్తింపు, తనకు రావాల్సిన పేరు వచ్చింది. నటుడిగా కమ్ బ్యాక్‌కి కావాల్సిన హైప్ వచ్చింది.
అయితే శివాజీ అంటే ముక్కుసూటి తనానికి కేరాఫ్. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతారు అంటారు. తాజాగా ఆయన మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు తలుచుకుంటే సీఎం కావడం పెద్ద సమస్య కాదన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లతో కలిసి రాజకీయాల్లో పనిచేయోచ్చు కదా అనే ప్రశ్నకి ఆయన రియాక్ట్ అయ్యారు. `నాకు తెలిసి మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ బేస్ ఎవరికీ లేదు. అటు ఆంధ్రప్రదేశ్‌లోగానీ, ఇటు తెలంగాణలోనూ వారికి మించిన ఫ్యాన్స్ మరెవ్వరికీ లేరు. వాళ్లు సీఎం కావాలనుకుంటే పెద్ద కష్టమైన పని కాదు. అయితే ఎక్కడో చిన్న లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని సరిదిద్దుకుని వెళితే వాళ్ల ఫ్యామిలీ నుంచి సీఎం కావడం పెద్ద విషయమే కాదు` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఏదైనా ఓపెన్‌గా చెబుతానని, కొందరు ఫీల్ కావచ్చు, కాకపోవచ్చు కానీ తాను నిజం మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా అని వెల్లడించారు శివాజీ. ఇక రాజకీయాల నుంచి ఎందుకు దూరమయ్యారనే ప్రశ్నకి స్పందిస్తూ. తాను రాజకీయాల్లో సేవ చేయాలనుకున్నా, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం రాజకీయాల్లోకి వెళ్లాను. అక్కడ ప్రజల గురించే మాట్లాడాను. ఈ క్రమంలో బీజేపీ పార్టీలో చేరాను. కానీ వాళ్లు తన ప్రామిస్‌ని ఎప్పుడైతే పక్కన పెట్టారో, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను.
ప్రజలకు సంబంధించిన విషయాలపై తాను ఇప్పుడు స్పందిస్తాను. అయితే ప్రజలకు సంబంధించిన నేను ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నా. దానికి లీడర్ షిప్ చాలా ముఖ్యం. లీడర్స్ కరెక్ట్ గా ఉండాలి. మనకు రావాల్సిన, ఈ తరానికి చెందాల్సిన మౌళిక సదుపాయాలు, వసతులు, వనరులు అన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. మనకు రావాల్సిన మంచి నీళ్లుగానీ, హెల్త్ గానీ, పవర్ గానీ, ఉద్యోగాలు గానీ, ఇలా ప్రతిదీ ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి.
ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయింది. కాస్ట్ ఫీలింగ్ పెరిగింది, అవసరమైతే, రాముడు, లేదంటే అల్లా, లేదంటే జీసస్, ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణి పెరిగిపోయింది. ఈ తరుణంలో ఒక మనిషి ఎంత కాలం పోరాడగలను, కానీ పదేళ్ల పాటు పోరాడాను. ప్రయత్నించాను. కానీ తప్పుకున్నా. అయితే ప్రజల గొంతుకుగా మాత్రం తాను ఎప్పుడూ ఉంటాను. కానీ నన్ను నటుడిగా నిలబెట్టి, నా గొంతుని పది మందికి తెలిసేలా కారణమైన సినిమాని మాత్రం వదలను. ఇకపై కంటిన్యూ చేస్తాను. ఈ క్రమంలోనే `బిగ్ బాస్`గానీ, వెబ్ సిరీస్ గానీ చేశాను. మరో సినిమా కూడా చేయబోతున్నా. త్వరలో అనౌన్స్ చేస్తానని తెలిపారు శివాజీ. ఈ సందర్భంగానే మెగా ఫ్యామిలీతో పనిచేయడంపై ఆయన పై విధంగా రియాక్ట్ అయ్యారు.
బిగ్ బాస్ షో కంటే ముందే తాను `యాష్ ట్యాగ్ 90ః ఏ మిడిల్ క్లాస్ బయోపిక్` అనే వెబ్ సిరీస్ లో నటించారు. వాసుకీ ఆయనకు పెయిర్‌గా చేసింది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం నిర్మించారు. ఇది జనవరి 5న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో శివాజీ పాల్గొని మాట్లాడారు. 90కి కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్ అని తెలిపారు.