రోజు కూలీకీ వెళుతూ జీవనం సాగించే గంగవ్వ ఇప్పుడు తెలుగు వారందరికీ సుపరిచితం. గడపదాటి పక్క ఊరికి కూడా వెళ్లడం తెలియని ఆమె ఇప్పుడు యూట్యూబ్ స్టార్. మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ తో గంగవ్వ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
గంగవ్వ అందరికీ చేరువవ్వడానికి కారణం ఆమె అమాయకత్వమే. తెలంగాణ పల్లె సంస్కృతికీ,పద్దతులకు ప్రతిరూపంగా కనిపించే గంగవ్వకు ఇప్పడు వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అక్షరజ్ఞానం లేని ఆమె ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తోంది.
గంగవ్వకు తనపుట్టిన రోజు ఎప్పుడు, ఎన్నేళ్ల కిందట అన్న విషయాలు కూడా తెలియదు. ప్రస్తుతం ఆమెకు 8 మంది మనవళ్లు, మనవరాళ్లు. వారంతా ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డారు. జగిత్యాల జిల్లా లంబాడపల్లి ఆమె స్వగ్రామం. ఆ ఊరి నుంచే ఆమె తెలుగు ప్రజలందరినీ పలకరిస్తోంది.
2012లో గంగవ్వ అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ మై విలేజ్ షో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించాడు. ముందు ఊళ్లో వీడియోలు తీసి పోస్ట్ చేసిన శ్రీకాంత్, తరువాత బామ్మను కూడా తన వీడియోల్లో భాగం చేశాడు. తొలుత మనవడు సమయం వృధా చేస్తున్నాడని భావించినా తరువాత ఆమె కూడా సపోర్ట్ చేసింది.
కెమెరా ముందు కూడా అమాయకంగా సహజంగా మాట్లాడే గంగవ్వ వీడియోలకు వేల సంఖ్యలో వ్యూస్ రావటం మొదలైంది. ఇప్పుడు ఆమె ఛానల్‌కు 15 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఇలా యూట్యూబ్ స్టార్‌గా మారక ముందు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది.
చిన్న వయసులోనే పెళ్లైంది. భర్త తాగుబోతు. డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్లి రూపాయి కూడా పంపకుండా అక్కడే చనిపోయాడు. ఆ సమయంలో ఉదయం కూలి పని చేస్తూ,రాత్రిళ్లు బీడీలు చుడుతూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది.
చేతిలో కన్నకూతురు చనిపోతే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వెక్కి వెక్కి ఏడ్చింది గంగవ్వ. తన చిన్న కూతురికి 8 ఏళ్ల వయసులో జ్వరం వచ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చినాఫలితం లేకపోయింది. ఆసుపత్రి వారు ఏం చెప్పకుండా కూతుర్ని తీసుకెళ్లమని గంగవ్వకు అప్పగించారు. అయితే బిడ్డను ఎత్తుకొని వెళుతుంటే పక్కన ఉన్నవారు చూసి పాప చనిపోయిన సంగతి చెప్పటంతో రోడ్డు మీదే గుండెలవిసేలా రోదించింది.
ఇలా ఎన్నో కష్టాలు దాటుకొని ఇంత వయసు వచ్చాక ఇప్పుడు జీవితంలో స్థిరపడుతోంది గంగవ్వ. ఇప్పుడు ఆదాయం బాగా ఉందని త్వరలోనే సొంత ఇళ్లు కూడా కట్టుకోబోతున్నట్టుగా తెలిపింది. అయితే ఇప్పటికీ ఆమెలో అదే అమాయకత్వం కనిపిస్తోంది.