యాంకర్‌ ప్రదీప్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` మూవీ రివ్యూ

Published : Apr 11, 2025, 04:05 PM IST

ప్రదీప్‌ మాచిరాజు తెలుగులో సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌. తనదైన యాంకరింగ్‌తో అలరించడంలో ఆయన దిట్ట. యాంకర్‌గా పాపులర్‌ అయిన ప్రదీప్‌ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ అడపాదడపా కీలక పాత్రల్లో నటించిన ఆయన ఇప్పుడు హీరోగా నిరూపించుకుంటున్నారు. ఇంతకు ముందు `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ మూవీ ఫర్వాలేదనిపించుకుంది. కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మరోసారి హీరోగా అలరించేందుకు వచ్చాడు. పవన్‌ కళ్యాణ్‌ మూవీ టైటిల్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` పేరుతో సినిమా చేశారు. ఇది శుక్రవారం(ఏప్రిల్‌ 11) విడుదలైంది.   

PREV
16
యాంకర్‌ ప్రదీప్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` మూవీ రివ్యూ
akkada ammayi ikkada abbayi movie review

యాంకర్‌గా కొన్నేళ్లపాటు బుల్లితెర ఆడియెన్స్ ని అలరించిన యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు యాంకరింగ్‌ వదిలేసి సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. హీరోగా మెప్పించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఓమూవీతో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` అనే సినిమాతో హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీలో ఆయనకు జోడీగా బుల్లితెర నటి దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించింది. నితిన్‌, భరత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంక్స్ అండ్‌ మంకీస్‌ పతాకంపై తెరకెక్కింది. నేడు శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

26
akkada ammayi ikkada abbayi movie review

కథః 
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ బార్డర్‌లో ఉన్న తెలుగు గ్రామం బైరిలంకలో ఒక విచిత్రమైన ఆచారం ఉంటుంది. ఆ ఊరి నుంచి ఎవరూ బయటకు పోవడానికి లేదు, బయటి ఊరువాళ్లు ఆ ఊరికి రావడానికి లేదు. ప్రభుత్వం ప్రకటించిన కుటుంబ నియంత్రణ పథకంలో భాగంగా అంతా ఒకే సంతానానికి కట్టుబడి ఉంటారు. దీంతో మొదటి సంతానంగా ఆ ఊర్లో అంతా మగబిడ్డలే జన్మిస్తారు. ఆడబిడ్డలు జన్మించరు.

ఇదేదో ఊరికి అరిష్టం వచ్చిందని అంతా భావిస్తారు. దీనికితోడు వర్షాలు లేక కరువు కూడా వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ ఊర్లో చివరి సంతానం ఒక్క ఆడబిడ్డ పుడుతుంది. దీంతో వర్షం వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధుల వస్తాయి. దీనికి కారణం తమ ఊర్లో మహాలక్ష్మి పుట్టిన వేళా విశేషంగా అంతా భావిస్తారు. అందుకే ఆమెకి రాజకుమారి(దీపికా పిల్లి) అనే పేరు పెడతారు.

ఆ ఆడబిడ్డని బయటి ఊరి వాళ్లకి ఇచ్చి పెళ్లి చేయకూడదని, ఆ ఊర్లో ఉన్న మగవాళ్లకే, ఆమె కోరకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని, అలా రాజా ఎవరినైతో కోరుకుంటుందో, అతనే ఆ ఊరికి నెక్ట్స్ ప్రెసిడెంట్‌ అని, ఊరి ప్రెసిడెంట్‌ తీర్మానం చెబుతాడు. రాజా పెరిగి పెద్దదవుతుంది. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుంది. కానీ పై చదువులకు పట్నం పంపించేందుకు ఊరి పెద్దలు నో చెబుతారు.

ఇక రాజాకి 21ఏళ్లు వస్తుంది. ఆ సమయంలోనే ఊర్లో బాత్‌రూమ్‌లు కట్టడానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ పనిమీద హైదరాబాద్‌లో పెద్ద ఇంజనీర్ అయిన కృష్ణ(ప్రదీప్‌ మాచిరాజు) తన డ్రైవర్‌(సత్య)తో కలిసి ఆ ఊరికి వస్తాడు. వీరిద్దరిని పట్టుకుని చెట్టుకి కట్టేస్తారు. ఊర్లో బాత్‌రూమ్‌లు కట్టడానికి లేదంటారు. కానీ ప్రెసిడెంట్ కొన్ని నియమాలతో వారిని ఊర్లో బాత్‌ రూమ్‌లు కట్టించేందుకు ఓకే చెబుతాడు.

ఆ నియమం ప్రకారం రాత్రిళ్లు మాత్రమే పనిచేయాలి, మార్నింగ్‌ బయటకు రాకూడదు. రాజాని వీళ్లు చూడకూడదు, రాజాకి వీళ్ల మొహాలు కనిపించకూడదు. మరి ఆ నియమాల ప్రకారం ఎలా పనిచేశారు? రాజాని చూడకుండా వీరిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు? ఆ తర్వాత ఊర్లో ఏం జరిగింది? కృష్ణ జీవితంలో చోటు చేసుకున్న మార్పులేంటి? ఆ ఊరి జనంతో కృష్ణ పడ్డ ఇబ్బందులేంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన సినిమా. 
 

36
akkada ammayi ikkada abbayi movie review

విశ్లేషణః 
కామెడీ సినిమాలు ఇప్పుడు బాగా వర్కౌట్‌ అవుతున్నాయి. రెండు గంటలు ఆడియెన్స్ ని నవ్విస్తే సినిమా సూపర్‌ హిట్‌ పక్కా. కథ, కథనాలు అవసరం లేదు. లాజిక్‌లతో పనేలేదు. ఆడియెన్స్ కి బోర్‌ కొట్టకుండా నవ్విస్తే చాలు. సినిమా హిట్‌ గ్యారంటీ. ఇటీవల కాలంలో యాక్షన్‌ మూవీస్‌తోపాటు ఇలాంటి కామెడీ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. `మ్యాడ్‌ 2` ఈ కోవలోనే మంచి హిట్‌ అయిన విషయం తెలిసిందే.

తాజాగా యాంకర్‌ ప్రదీప్‌ కూడా `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`తో అదే ఫన్‌ ని నమ్ముకున్నాడు. హైదరాబాద్‌లో కంస్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేస్తే అతను ఓ మారు మూల గ్రామంలో బాత్‌ రూమ్‌లు నిర్మించే ప్రాజెక్ట్ చేపట్టడం, అక్కడ వెళ్లినప్పుడు ఆ జనం కట్టుబాట్ల కారణంగా తాను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది మూవీ. సందర్భానుసారంగా, సన్నివేశాల ఆధారంగా పుట్టే కామెడీని బేస్‌ చేసుకుని ఈ మూవీని రూపొందించారు.

అయితే కావాలని కామెడీ చేస్తే అది బలవంతం అవుతుంది. కానీ ఇందులో సహజంగా ఫన్‌ జనరేట్‌ అయ్యేలా ప్లాన్‌ చేశారు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. అదే ఈ సినిమాకి పెద్ద అసెట్‌. బైరిలంక ఊర నియమాల ద్వారా ప్రదీప్‌, సత్య పడే ఇబ్బందులు, వీళ్లు చేసే కోతిపనులు కామెడీ పుట్టిస్తాయి.

ఫస్టాఫ్‌ అంతా దీనిచుట్టూనే తిరుగుతుంది. అందులోనే లవ్‌ ట్రాక్‌ కూడా నడుస్తుంది. అది కూడా మరీ ఓవర్‌గా లేకుండా కాస్త ఫ్రెష్‌గా డీల్‌ చేసిన తీరు బాగుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్ సీరియస్ గా మారి ట్విస్ట్ ఇస్తూ సెకండాఫ్‌కి లీడ్‌ ఇస్తుంది. 
 

46
akkada ammayi ikkada abbayi movie review

అయితే సినిమా చూసినప్పుడు ఫస్టాఫ్‌తోనే కథ అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ అంతా మరో ట్రాక్‌లో సాగుతుంది. మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతారు. హైదరాబాద్‌లో బైరిలంక కుర్రాళ్లకి పెళ్లిళ్లు చేయడమనే టాస్క్ ప్రదీప్ కి పెద్ద సవాల్‌గా మారుతుంది. వారిని డీల్‌ చేయడం పెద్ద టాస్క్ గా ఉంటుంది. ఇందులోనూ ఫన్‌ జనరేట్‌ చేసిన తీరు బాగుంది.

ఇక క్లైమాక్స్ లో సీన్‌ సీరియస్‌గా మారుతుంది. ఎమోషనల్‌ సైడ్‌ తిరుగుతుంది. వెన్నెల కిశోర్‌, బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చి నవ్వించారు. ప్రదీప్‌ చిన్నప్పట్నుంచి మరొకరికి సాయం చేయడం విషయంలో తాను నమ్మే సిద్ధాంతం తప్పు అని తెలుసుకున్నప్పుడు వచ్చే ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. నవ్విస్తూ నవ్విస్తూ గుండె బరువెక్కించినట్టు ఉంటుంది.

అయితే కథలో దమ్ములేకపోవడం కాస్త మైనస్‌గానే చెప్పొచ్చు. కామెడీ కోసం రాసుకున్నది కాబట్టి లాజిక్‌ లను పట్టించుకోకపోవడం మంచిది. కానీ ఫస్టాఫ్‌ తరహాలోనే సెకండాఫ్‌ని కూడా హిలేరియస్ గా ప్లాన్‌ చేస్తే బాగుండేది. అక్కడక్కడ కాస్త ల్యాగ్‌ గా అనిపిస్తుంది. సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

మరికొన్ని చాలా అసహజంగా అనిపిస్తాయి. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే సినిమా మాత్రం రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

56
akkada ammayi ikkada abbayi movie review

నటీనటులుః 
కృష్ణ పాత్రలో ప్రదీప్‌ బాగా చేశాడు. తన నటనలో యాంకరింగ్‌ ఛాయలు కనిపించాయి. కానీ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. బాగా మెప్పించాడు. హీరో అని హీరోయిజానికి పోకుండా తన పాత్రని రియాలిటీకి దగ్గరగా చూపించిన తీరు బాగుంది. అందులో ప్రదీప్ నటన అంతే బాగా ఆకట్టుకుంది. దీపికా పిల్లి రాజా పాత్రలో మెప్పించింది. డామినేటింగ్‌ సన్నివేశాల్లో ఆమె అనుభవం సరిపోలేదు. కానీ తనవంతు బెస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

గెటప్‌ శ్రీను రోల్‌ నవ్వులు పూయిస్తుంది. సత్య కామెడీ పరంగా మరో బిగ్‌ అసెట్‌ అని చెప్పాలి. ప్రదీప్‌కి వీరిద్దరు తోడు కావడంతో కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. దీపికా తల్లిగా ఝాన్సీ ఉన్నంతసేపు ఓకే అనిపించింది. ప్రదీప్‌ తండ్రిగా మురళీధర్‌ గౌడ్‌ తన మార్క్ నటనతో మెప్పించాడు. సినిమాకి ప్లస్‌ అయ్యారు. ప్రెసిడెంట్‌ పాత్రతోపాటు మిగిలిన ఆర్టిస్ట్ లు పాత్రల పరిధి మేరకు మెప్పించారు. జబర్దస్త్ బ్యాచ్‌ కూడా నవ్వులు పూయించింది. 
 

66
akkada ammayi ikkada abbayi movie review

టెక్నీకల్‌గాః 

సినిమా టెక్నీకల్‌గా చాలా బాగుంది. ముఖ్యంగా కెమెరా వర్క్ అద్భుతం. చిన్న సినిమాకి ఇంత మంచి విజువల్స్ అంటే మామూలు కాదు. ఎంఎన్‌ బాల్‌రెడ్డి తన బెస్ట్ ఇచ్చారు. విజువల్స్ ని బ్యూటీఫుల్‌గా చూపించారు. ప్రతి ఫ్రేమ్‌ ఆకట్టుకుంటుంది. లావిష్‌గా ఉంటుంది. ఒక అద్భుతమైన ఫీలింగ్‌ని కలిగించారు.

ఆయన భవిష్యత్‌లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌ అవుతారని చెప్పొచ్చు. కొడటి పవన్‌ కళ్యాణ్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. దర్శకులు నితిన్‌, భరత్‌ లు సినిమాని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. ఫన్ ఎలిమెంట్లని బాగా రాసుకున్నారు. అయితే కథపరంగా చూసినప్పుడు ఇది ఓటీటీ ఫిల్మ్ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ విషయంలో బిగ్‌ స్క్రీన్‌ ఎక్స్ పీరియెన్స్ కోసం ఇంకా వర్క్ చేయాల్సింది.

కానీ నవ్వులు పూయించే విషయంలో విజయం సాధించారు. సెకండాఫ్‌ని ఇంకా బాగా డీల్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. బాగా రిచ్‌గా తీశారు. 

ఫైనల్‌గా ః నవ్వడం కోసం లాజిక్‌ అవసరం లేదు. కాసేపు నవ్వుతూ ఎంజాయ్‌ చేయడం కోసం ఈ మూవీ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

రేటింగ్‌ః 2.75
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories