
దేశభక్తి అనే స్పృహ ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించింది. అది ఎప్పటికీ ప్రజల్లో ఉండాల్సిందే. దేశభక్తి కలిగిన యువకులు బాధ్యతగా ఉంటారు. దేశ అభివృద్ధికి కృషి చేస్తారు. అత్యంత బలమైన మాధ్యమంగా ఉన్న సినిమా ద్వారా జనాల్లో దేశభక్తి రగిలించే ప్రయత్నం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు పలువురు దేశభక్తి చిత్రాల్లో నటించారు. ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
నా దేశం(1982)
స్టార్ హీరోగా ఎన్టీఆర్ వెలిగిపోతున్న రోజుల్లో దర్శకుడు బాపయ్య తెరకెక్కించిన చిత్రం న దేశం. ఈ మూవీలో ఎన్టీఆర్ అనాథగా కనిపిస్తారు. జయసుధ హీరోయిన్. అప్పటి సమాజంలో ఉన్న రాజకీయ, సామాజిక లోపాలను ఈ సినిమాలో ఎండగట్టారు.
బొబ్బిలి పులి (1982)
ఎన్టీఆర్ నటించిన మరొక దేశభక్తి చిత్రం బొబ్బిలి పులి. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్ ఆర్మీ మేజర్ రోల్ చేశాడు. సమాజంలో చీడపురుగులా తయారైన దుర్మార్గులను అంతం మొందించేందుకు హంతకుడిగా మారిన మేజర్ గా ఎన్టీఆర్ కనిపించారు. శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కోర్ట్ రూమ్ సీన్ సినిమాకే హైలెట్. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను సైతం ఎత్తిచూపారు.
నేటి భారతం( 1983)
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సుమన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు టి. కృష్ణ తెరకెక్కించిన నేటి భారతం టాలీవుడ్ లో తెరకెక్కిన దేశభక్తి చిత్రాల్లో ఒకటి. సామాజిక దురాగతాలను ఎండగడుతూ ప్రజల్లో స్ఫూర్తి నింపేలా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గా కూడా విజయం సాధించింది.
మేజర్ చంద్రకాంత్ (1993)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పేట్రియాటిక్ మూవీ మేజర్ చంద్రకాంత్. సీనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేయగా మోహన్ బాబు హీరోగా నటించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఓ సాంగ్ లో అనేకమంది ఉద్యమవీరుల గెటప్స్ వేశారు. ఆ సాంగ్ ఎప్పటికీ హైలెట్. ఈ మూవీ మంచి విజయం సాధించింది.
భారతీయుడు (1996)
ఒకప్పటి స్వాతంత్య్ర ఉద్యమ వీరుడు నేటి సమాజంలో కూరుకుపోయిన లంచగొండితనం పై పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ . దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆణిముత్యాల్లో భారతీయుడు ఒకటి. వృద్ధుడిగా కమల్ నటన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మనీషా కొయిరాలా, ఊర్మిళ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. తెలుగులో ఇది డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు.
ఖడ్గం(2002)
విలక్షణ చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన గొప్ప దేశభక్తి చిత్రం ఖడ్గం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే కాన్సెప్ట్ తో టెర్రరిజానికి వ్యతిరేకంగా ఖడ్గం తెరకెక్కింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేశారు. పేట్రియాటిక్ జోనర్ లో ఖడ్గం బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. రవితేజ కెరీర్ కి పునాది వేసింది.
సుభాష్ చంద్రబోస్(2005)
వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి చిత్రం సుభాష్ చంద్రబోస్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోసియో ఫాంటసీ జోనర్ లో రూపొందించారు. పీరియాడిక్, మోడరన్ గెటప్స్ లో వెంకటేష్ కనిపించారు. జెనీలియా, శ్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ కమర్షియల్ గా ఆడలేదు.
మహాత్మ (2009)
హీరో శ్రీకాంత్ వందవ చిత్రంగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం మహాత్మ. నేటి సమాజంలో ఉన్న కుళ్ళును సెటైరికల్ గా చూపించి గాంధీ సిద్ధాంతాల చాటి చెప్పిన చిత్రంగా మహాత్మ నిలిచింది.
పరమవీరచక్ర(2011)
నటసింహం బాలకృష్ణ దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో వచ్చిన దేశభక్తి చిత్రం పరమవీరచక్ర. బాలయ్య మేజర్ జయసింహ, చంద్ర శేఖర్ అనే డ్యూయల్ రోల్స్ చేశారు. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరమవీర చక్ర విజయం సాధించలేదు.
ఆర్ ఆర్ ఆర్ (2022)
రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ ఉత్తమ దేశభక్తి చిత్రాల్లో ఒకటి. ఇద్దరు వీరులు భీమ్, రామ్ తమ లక్ష్య సాధన కోసం బ్రిటీష్ కోటలను ఎలా బద్దలు కొట్టారు. వారిపై ఎలా విజయం సాధించారనేది వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఫిక్షనల్ కథగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లు కొల్లగొట్టింది. హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వీటితో పాటు మేజర్ చంద్రకాంత్, సర్దార్ పాపారాయుడు, నా పేరు సూర్య, కర్తవ్యం వంటి పలు అద్భుతమైన దేశభక్తి చిత్రాలు టాలీవుడ్ లో తెరకెక్కాయి.