ఐపిఎల్ వేలంతో మారిన జట్లు :
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ప్రతి టీంలో మార్పులు వుండనున్నాయి. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపిఎల్ మెగా వేలం జరిగింది. కొందరు కీలక ఆటగాళ్లు మినహా మిగతా జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లను వివిధ జట్లు కొనుగోలుచేసాయి. ఇలా ఈ వేలంలో 182 మంది ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు రూ.639 కోట్లకు పైగా ఖర్చు చేసాయి.
ఈ వేలంపాట ద్వారా గతంలో ఓ జట్టులో వున్న ఆటగాళ్లు ఇప్పుడు మరోజట్టుకు మారారు. కొన్ని జట్లకు ఏకంగా కెప్టెన్లు కూడా మారారు. ఈ వేలంలో డిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది లక్నో సూపర్ జెయింట్స్. తద్వారా ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.
అలాగే గతంలో కోల్ కతా కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ ను తాజా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.26 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ ను రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది కోల్ కతా. ఇలా కేవలం ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ కోసమే ఏకంగా రూ.76 కోట్లకు పైగా ఖర్చుచేసాయి ఫ్రాంచైజీలు.
ఇక యువ బౌలర్ అర్షదీప్ ను కూడా రికార్డు స్థాయిలో రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అలాగే చాహల్ ను కూడా రూ.18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లలో బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్, ఆర్చర్ ను రాజస్థాన్ రూ.12.50, బౌల్ట్ ను ముంబై రూ.12.50, హెజిల్ వుడ్ ను బెంగళూరు రూ.12.50, స్టార్క్ ను డిల్లీ రూ.11.75 కోట్లకు దక్కించుకున్నాయి.
ఇక హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇకపై గుజరాత్ టైటాన్స్ కు ఆడనున్నాడు. అతడిని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే హైదరాబాద్ టీం యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను రూ.11.25, సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ ను రూ.8 కోట్లు, రాహుల్ చాహర్ రూ.3.20 కోట్లు, అభినవ్ మనోహర్ ను రూ.3.40 కోట్లు, ఆడమ్ జంపాను రూ.2.40 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.