నిజానికి ఈ నానో కారు రతన్ టాటా కలల ప్రాజెక్టు. అయితే ఈ సారి రతన్ టాటా తన వ్యక్తిగత సహాయకుడు శంతను నాయుడుతో కలిసి టాటా నానో ఎలక్ట్రిక్ కారులో దర్శనమిచ్చి సంచలనానికి తెర లేపారు. అయితే రతన్ టాటా ఇలా టాటా నానోలో కనిపించడం వెనుక ఓ మతలబు ఉందని అంతా భావిస్తున్నారు. అదే టాటా నానో ఎలక్ట్రిక్ మార్కెట్లోకి వస్తుందనే వార్తలకు ఊతమిస్తోంది.
నానోలో రతన్ టాటాను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో, టాటా మోటార్స్ నానో కారు ఎలక్ట్రిక్ అవతార్‌లో విడుదల చేయబోతుందా అని అంతా ఆరా తీస్తున్నారు. కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రమోట్ చేయడానికి రతన్ టాటా ఇలా దర్శనం ఇచ్చారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే రతన్ టాటా తాజాగా తాజ్ హోటల్ కు ఎలక్ట్రిక్ నానో కారు ద్వారా వచ్చారు. నిజానికి ఈ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ తయారు చేయలేదు. ఇది కస్టమ్-మేడ్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పవర్‌ట్రెయిన్ సొల్యూషన్‌లను తయారు చేసే కంపెనీ అయిన ElectraEV ఈ కారును రతన్ టాటాకు బహుమతిగా ఇచ్చింది. Electra EV కంపెనీ రతన్ టాటా చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది, దీని మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోయంబత్తూరులో ఉంది.
ElectraEV నానో 150 మైలేజీని ఇస్తుంది
ElectraEV ఈ టాటా నానో కారును 624cc పెట్రోల్ ఇంజన్‌తో ఎలక్ట్రిక్ వాహనంగా మార్చింది. దీనికి సూపర్ పాలిమర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 72V పవర్‌ట్రెయిన్ ఇవ్వబడింది. ఈ అప్ డేటెడ్ టాటా నానో ఎలక్ట్రిక్ మైలేజ్ 150 నుండి 160 కి.మీ. ఈ కారు దాదాపు 10 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకోగలదు.
మీడియా నివేదికల ప్రకారం, ElectraEV ఈ రెట్రోఫిట్టింగ్ FAME కంప్లైంట్, ARAI మరియు RTO సర్టిఫికేట్ పొందింది. అంటే, మీ కారును ఈ కంపెనీ ద్వారా ఎలక్ట్రిక్ గా మార్చుకునేందుకు నమోదు చేసుకోవచ్చు. కంపెనీ ప్రస్తుతం ఫ్లీట్ సెగ్మెంట్ కోసం రెట్రోఫిటింగ్ సర్వీస్‌పై దృష్టి సారిస్తోంది. ElectraEV అందించే ఇతర ఉత్పత్తులు, సేవలలో వాహన నియంత్రణ యూనిట్లు, టెలిమాటిక్స్, ప్రోటోటైపింగ్, హోమోలోగేషన్ రెడీనెస్, కొన్ని అమ్మకాల తర్వాత సర్వీసెస్, సొల్యూషన్స్ ఉన్నాయి.