టాటా మోటార్స్ మూడు కొత్త కార్లను ఆవిష్కరించనుంది. పంచ్, టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ ధర కూడా బడ్జెట్ లోనే ఉంటుందని సమాచారం. ప్రతి ఒక్క కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా లక్ష్యాన్ని నెరవేర్చడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది. అందుకే కార్ల ధరలు తగ్గించి విడుదల చేయనుందని తెలుస్తోంది.
ఆటో ఎక్స్‌పో (భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025) ఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతుంది. అదేవిధంగా ద్వారకా యశోభూమిలో జనవరి 18-21 వరకు నిర్వహిస్తారు. గ్రేటర్ నోయిడా ఎక్స్‌పో మార్ట్ సెంటర్‌లో జనవరి 19 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్‌లో దేశ, విదేశ కంపెనీలతో పాటు దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
జనవరి 17 నుంచి ఢిల్లీ, నోయిడాలో కార్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఇందులో పలు ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్లను ప్రదర్శించనున్నాయి. టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2025లో మూడు కొత్త కార్లను తీసుకురానుంది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలు తీరేలా ఈ కార్లు డిజైన్ చేసినట్లు టాటా కంపెనీ ప్రకటించింది. అందుకే వీటి ధర కూడా రూ.6 లక్షల లోపు ఉండనుందని సమాచారం. ఈ ఏడాది మూడు కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని టాటా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్న టాటా కొత్త కార్ల గురించి తెలుసుకుందాం రండి.
1. టాటా పంచ్ (Tata Punch Facelift)
టాటా మోటార్స్ ప్రముఖ మైక్రో SUV పంచ్ న్యూ లుక్ తో మార్కెట్ లోకి రానుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, కొత్త గ్రిల్, DRL లైట్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాత ఫీచర్లు ఇందులో ఉంటాయట. దీని ధర దాదాపు రూ.6 లక్షలు ఉండవచ్చని అంచనా.
2. టాటా టియాగో (Tata Tiago Facelift)
సైజులో చిన్నగా, డిజైన్ లో అందంగా ఉంటుంది టాటా టియాగో. టాటా కంపెనీకి ఇష్టమైన కార్లలో ఒకటైన టియాగో కొత్త వెర్షన్ కూడా ఎగ్జిబిషన్‌లో మెరవనుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొత్త హెడ్‌ల్యాంప్, DRLతో కూడిన రేడియేటర్ గ్రిల్, వైర్‌లెస్ ఛార్జింగ్, USB టైప్-C పోర్ట్, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. దీని ధర కూడా రూ.5 లక్షలు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
3. టాటా టిగోర్ (Tata Tigor Facelift)
టాటా ప్రముఖ సెడాన్ టిగోర్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఎగ్జిబిషన్‌లో ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండవచ్చు. ఈ కారు లీటరు పెట్రోల్‌కు 19.43 నుంచి 28.06 కి.మీ. మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధర 6 లక్షలు ఉండవచ్చు.