ఎవరైనా వారి స్టార్టప్ కంపెనీని ప్రారంభించడానికి మూలధనం చాలా అవసరం. వారి ఆలోచన సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగితేనే ఎవరైనా స్టార్టప్‌లకు నిధులు ఇస్తారు. ముఖ్యంగా బ్యాంకులైతే ఆస్తులు ష్యూరిటీ పెట్టిన దరఖాస్తుదారులకు మాత్రమే రుణాలు ఇస్తాయి. అయితే వ్యాపార ఆలోచన బాగున్నా ష్యూరిటీ లేకపోతే ఎవరూ లోన్స్ ఇవ్వరు. అలాంటి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(SISFS).. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం ఇది. 2021లో ప్రారంభమైన ఈ పథకం భారతదేశంలోని ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ముఖ్యంగా ఇన్నోవేటివ్ ఆలోచనలను ప్రోత్సహించడానికి ఈ పథకం రూపొందించారు. ఈ పథకం భారతదేశంలో స్టార్టప్ కంపెనీలకు అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పునాది వేస్తోంది. అంతేకాకుండా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ప్రారంభ దశ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అమలు కోసం రూ.945 కోట్ల నిధిని సమకూర్చింది. ఈ పథకం ద్వారా భారతదేశం వ్యాప్తంగా ఉన్న అర్హులైన వారికి స్టార్టప్‌లను ప్రారంభించడానికి నిధులు ఇచ్చి సహాయపడుతుంది. 'కాన్సెప్ట్ ప్రూఫ్' నే ఆధారంగా చేసుకొని పెట్టుబడి అందిస్తారు. అంటే బిజినెస్ ఆలోచన కేంద్ర ప్రభుత్వ కమిటీకి నచ్చి, ఇది కచ్చితంగా వర్కవుట్ అవుతుందని వారికి నమ్మకం కలిగితే చాలు. ఆ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నిధులు ఇస్తారు.
సాధారణంగా కాన్సెప్ట్ ప్రూఫ్, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడక్షన్ పరీక్షలు, మార్కెట్ ఎంట్రీ ఇలాంటి దశల్లో సరైన పెట్టుబడి చేతిలో లేక పారిశ్రామికవేత్తలు వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిలో వారికి అందించే నిధులు, స్టార్టప్‌ల బూస్టింగ్ కి బాగా ఉపయోగపడతాయి. ఇది ఉపాధి కల్పనకు దారితీస్తుంది.
నిపుణుల సలహా కమిటీ
కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం(DPIIT) ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ద్వారా నిపుణుల సలహా కమిటీ(EAC) ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అమలు, పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. ఈ నిపుణుల కమిటీ సీడ్ ఫండ్ కేటాయింపు కోసం ఇంక్యుబేటర్ స్టేజ్ లో ఉన్న స్టార్టప్ లను ఎంపిక చేస్తుంది. వాటి పురోగతిని పర్యవేక్షిస్తుంది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ లక్ష్యాలను నెరవేర్చడానికి, నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది.
ఏ స్టార్టప్ లకు నిధులు ఇస్తారు..
సామాజిక ప్రభావం, వ్యర్థాల నిర్వహణ, నీటి నిర్వహణ, విద్య, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పవర్, సెక్యూరిటీ, అంతరిక్షం, రైల్వే, చమురు, గ్యాస్ వంటి రంగాలలో ఆవిష్కరణ పరిష్కారాలను సృష్టించే స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ స్టార్టప్ కంపెనీ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలోని వేరే ఏ ఇతర పథకం కింద రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక సహాయం పొంది ఉండకూడదు.
కంపెనీల చట్టం-2013, SEBI(ICDR) నిబంధనల ప్రకారం ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడి నిధులు పొందడానికి దరఖాస్తు చేసుకునే సమయంలో స్టార్టప్‌లో భారతీయ ప్రమోటర్ల వాటా కనీసం 51% ఉండాలి. స్టార్టప్ దరఖాస్తుదారుడు పథకం మార్గదర్శకాల ప్రకారం ప్రతి సందర్భంలోనూ గ్రాంట్, లోన్/కన్వర్టిబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో సీడ్ సపోర్ట్ పొందవచ్చు. ఈ అర్హతలు ఉంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో ఈ పథకంలో రూ. 30 లక్షల వరకు లోన్ మీరు పొందొచ్చు.