Second Hand Mobile: సెకండ్‌ హ్యాండ్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ బిజినెస్‌లో లాభాలు ఎలా ఉంటాయి?

Published : Oct 24, 2026, 10:26 AM IST

Second Hand Mobile: కొత్త ఫోన్ కొనడం కంటే మంచి కండిషన్‌లో ఉన్న పాత ఫోన్ కొనడానికే చాలామంది మొగ్గు చూపుతున్నారు. కొత్త ఫోన్ల ధరలు పెరుగుతుండటం వంటివి సెకండ్ ‌హ్యాండ్ మొబైల్ మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. మరి ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయో చూద్దాం.

PREV
16
సెకండ్ హ్యాండ్ మొబైల్ బిజినెస్

కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అందుకే చాలామంది తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న పాత మొబైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సెకండ్‌హ్యాండ్‌ ఫోన్‌లకు ఆదరణ పెరుగుతుండగా, వాటి కొనుగోళ్లు, అమ్మకాల చుట్టూ కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల ఈ బిజినెస్‌లో నిజంగా ఎంత లాభం ఉంటుంది? ఏ ఫోన్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంది? ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

26
పాత ఫోన్లకు ఎందుకు డిమాండ్‌ పెరుగుతోంది?

సెకండ్‌హ్యాండ్‌ మొబైళ్లకు డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణం ధర. కొత్త ఫోన్‌ కొనుగోలు చేయడానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తే, అదే స్థాయి ఫీచర్లు ఉన్న పాత మోడల్‌ను తక్కువ ధరకు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలనుకునేవారు, అదనంగా మరో ఫోన్‌ అవసరమైన వారు ఈ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నారు.

మరోవైపు, కొత్త ఫోన్‌ కొనుగోలు చేసేవారు తమ పాత ఫోన్లను విక్రయించడం లేదా ఎక్స్ఛేంజ్‌ చేయడం వల్ల సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌కు ఫోన్ల సరఫరా కూడా పెరుగుతోంది. ఓ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో భారత్‌లో రీఫర్బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల పరిమాణం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం పెరిగింది. కొత్త ఫోన్ల ధరలు పెరగడం, తక్కువ ధరలో ప్రీమియం ఫోన్లు పొందాలనే ఆసక్తి ఈ వృద్ధికి కారణాలుగా నివేదిక పేర్కొంది.

36
ఏ ఫోన్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది?

సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో అన్ని ఫోన్లకు ఒకే స్థాయిలో డిమాండ్‌ ఉండదు. మంచి కెమెరా, పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు ఇతర అంశాల ఆధారంగా ఫోన్లకు కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా యాపిల్‌ ఐఫోన్లలోని పాత మోడళ్లకు, శాంసంగ్‌ ప్రీమియం సిరీస్‌ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు తమ ప్రాంతంలో ఏ బ్రాండ్లు, ఏ ధరల ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో ముందుగా తెలుసుకోవాలి. తక్కువ ధరలో లభించే బడ్జెట్‌ ఫోన్లతో పాటు మంచి కండిషన్‌లో ఉన్న ప్రీమియం మోడళ్లను కూడా పరిశీలించవచ్చు.

46
సెకండ్‌హ్యాండ్‌ ఫోన్‌ బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి?

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద షోరూమ్‌ అవసరం లేదు. మొదట కొంచెం పెట్టుబడితో ఇంటి నుంచే లేదా చిన్న షాప్ ద్వారా ప్రారంభించవచ్చు. పాత ఫోన్లను విక్రయించాలనుకునే వ్యక్తుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం, ఎక్స్ఛేంజ్‌ ద్వారా వచ్చే ఫోన్లను సేకరించడం, నమ్మకమైన సరఫరాదారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా స్టాక్‌ను సమకూర్చుకోవచ్చు. అయితే కొనుగోలు చేసిన ప్రతి ఫోన్‌ను విక్రయించే ముందు పూర్తిగా పరీక్షించడం ముఖ్యం.

బ్యాటరీ పనితీరు, డిస్‌ప్లే, టచ్‌, కెమెరా, స్పీకర్లు, మైక్రోఫోన్‌, ఛార్జింగ్‌ పోర్ట్‌, నెట్‌వర్క్‌, వై-ఫై, ఫింగర్‌ప్రింట్‌ లేదా ఫేస్‌ అన్‌లాక్‌ వంటి ఫీచర్లను పరిశీలించాలి. ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్‌ను తనిఖీ చేయాలి. ఫోన్‌లోని పాత డేటాను పూర్తిగా తొలగించి విక్రయించాలి.

56
ఈ వ్యాపారంలో లాభాలు ఎలా ఉంటాయి?

సెకండ్‌హ్యాండ్‌ ఫోన్‌ బిజినెస్‌లో లాభం ప్రధానంగా తక్కువ ధరకు ఫోన్‌ను కొనుగోలు చేయడం, దాని కండిషన్‌ను మెరుగుపరచడం, సరైన ధరకు విక్రయించడంపై ఆధారపడి ఉంటుంది. ఒక ఫోన్‌ను రూ.8,000కు కొనుగోలు చేస్తే, దానికి చిన్నపాటి రిపేర్లు, క్లీనింగ్,ఇతర ఖర్చలు కలిపి రూ.1000 అయితే దాని మొత్తం ఖర్చు రూ.9,000 అవుతుంది. ఆ ఫోన్‌ను రూ.10,000కు విక్రయిస్తే రూ.1000 మిగులుతుంది. అయితే లాభం అనేది ఫోన్‌ మోడల్‌, మార్కెట్‌ ధర, బ్యాటరీ పరిస్థితి, రిపేర్ ఖర్చు, అమ్మకానికి పట్టే టైం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అలాగే నార్మల్ షాపులతో పాటు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌ మీడియా మార్కెట్‌ప్లేస్‌లు, స్థానిక కొనుగోలు–అమ్మకాల గ్రూపుల ద్వారా కూడా పాత ఫోన్లను విక్రయించవచ్చు. ఫోన్‌ అసలు ఫొటోలు, స్పష్టమైన వివరాలు, బ్యాటరీ పరిస్థితి, వారంటీ వంటి అంశాలను నిజాయతీగా వెల్లడిస్తే కొనుగోలుదారుల్లో నమ్మకం పెరుగుతుంది.

66
వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు

ఈ వ్యాపారంలో లాభాల అవకాశాలు ఉన్నప్పటికీ, రిస్కులు కూడా తక్కువేమీ కావు. పాత మొబైల్‌ బయటకు చూడటానికి బాగున్నప్పటికీ లోపల సాంకేతిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల కొనుగోలు చేసే ముందు డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్‌, కెమెరా, స్పీకర్లు, మైక్రోఫోన్‌, ఛార్జింగ్‌ పోర్ట్‌, బ్యాటరీ, నెట్‌వర్క్‌ వంటి అంశాలను పరీక్షించాలి. కొత్త ఫోన్ల ధరలు తగ్గడం, పాత మోడళ్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు నిలిచిపోవడం, మార్కెట్‌లో పోటీ పెరగడం వంటి అంశాలు కూడా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేగంగా అమ్ముడయ్యే మోడళ్లను గుర్తించడం, కొనుగోలు ధరను జాగ్రత్తగా నిర్ణయించడం, ప్రతి లావాదేవీకి సంబంధించిన ఖర్చులను నమోదు చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories