Credit Card Rules: క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్న వారికి అలర్ట్..జులై 15 నుంచి ఈ రూల్స్‌ మారుతున్నాయ్‌!

Published : Jul 04, 2025, 03:38 PM IST

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులకు జులై 15 నుంచి  చెల్లింపు నియమాలు మారినట్లు సమాచారం. ఆగస్టు 11 నుంచి కొన్ని కార్డుల్లో బీమా సౌకర్యం రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

PREV
18
కీలకమైన మార్పులు

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలకమైన మార్పులు జరగనున్నాయి. జూలై 15 నుంచి కొన్ని ముఖ్యమైన చెల్లింపు నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. అలాగే ఆగస్టు 11 నుంచి కొన్నికొన్ని కార్డుల్లో ఇన్షూరెన్స్‌ సదుపాయం కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఈ మార్పులు వినియోగదారుల ఖర్చులపై ప్రభావం చూపే అవకాశముంది.

28
మినిమమ్ అమౌంట్ డ్యూ

ప్రస్తుతం చాలామంది వినియోగదారులు నెల నెలా బిల్లును పూర్తిగా చెల్లించకపోయినా, కనీస మొత్తాన్ని మాత్రం చెల్లించి ఆలస్య రుసుములను నివారించేందుకు ప్రయత్నిస్తారు. దీనినే 'మినిమమ్ అమౌంట్ డ్యూ' అంటారు. అయితే జూలై 15 నుంచి ఈ కనీస చెల్లింపు మొత్తాన్ని లెక్కించే విధానంలో మార్పు జరుగుతుంది.

38
చార్జీలు, వడ్డీలు

ఇప్పటివరకు కొన్ని చార్జీలు, వడ్డీలు లెక్కలోకి తీసుకోకుండా ఈ కనీస మొత్తం నిర్ణయించేవారు.కానీ ఇకపై జీఎస్‌టీ, ఈఎంఐ, సర్వీస్ ఛార్జీలు, ఇతర ఫీజులు, ఇంకా మిగిలిన బకాయిలపై 2 శాతం కలిపి కనీస చెల్లింపు మొత్తాన్ని నిర్ణయించనున్నారు. ఈ విధంగా చూడగానే వినియోగదారులకు చెల్లించాల్సిన కనీస మొత్తం పెరిగే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా చెల్లించకపోతే బకాయిలు పెరిగి, అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

48
జీఎస్‌టీ కట్

ఇక చెల్లింపుల సర్దుబాటు విధానంలో కూడా మార్పులు ఉన్నాయి. వినియోగదారులు చేసిన చెల్లింపులను బ్యాంకు మొదట జీఎస్‌టీకి, ఆ తర్వాత ఈఎంఐలకు, తరువాత ఇతర ఛార్జీలకు వాడుతుంది. చివరికి మాత్రమే రిటైల్ ఖర్చులు లేదా నగదు ఉపసంహరణలకోసం తీసుకుంటుంది.

ఉదాహరణకు, మీరు 10,000 రూపాయల బిల్లు చెల్లిస్తే, అందులో మొదట జీఎస్‌టీ కట్ అవుతుంది. తర్వాత మీ కార్డుపై ఈఎంఐ ఉన్నట్లయితే దానిలో కొంత, మిగిలిన భాగాన్ని ఇతర ఫీజులకు కేటాయించబడుతుంది. దీంతో నిజమైన ఖర్చుపై మీ చెల్లింపు తక్కువగా మిగిలిపోతుంది. ఈ పరిస్థితిలో వడ్డీ మరింత పెరగనుంది.

58
ఆ ప్రమాద బీమా రద్దు

కొన్ని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై లభిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను బ్యాంకు రద్దు చేయనుంది. ఆగస్టు 11 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.ఇప్పుడు ఈ బీమా కొన్ని కార్డులకు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కవర్ ఇస్తోంది. కానీ యూకో బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ఎలైట్, పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డ్, కర్ణాటక బ్యాంక్ ఎస్‌బీఐ ప్రైమ్ వంటి ఎంపిక చేసిన కార్డుల్లో ఈ ప్రయోజనం ఇక ఉండదు.

68
బ్యాంకులు మినహాయింపు

వినియోగదారులు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో లేదా ఉన్న కార్డులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రతి సందర్భంలోనూ, బ్యాంక్ షరతులు, ప్రయోజనాల గురించి స్పష్టంగా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే బ్యాంకులు మినహాయింపులు ఇచ్చే సమయంలో, తర్వాత అవి రద్దు చేసే అవకాశం ఉండటంతో అవగాహన లేకపోతే అనవసరంగా అదనపు ఖర్చులు భరిస్తే తప్పదు.

78
నిబంధనల్లో మార్పులు

కాగా, ఎస్‌బీఐ తరచూ తమ కార్డులపై నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉంటోంది. వినియోగదారులు తమ ఖాతాలపై ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకునేందుకు ఎస్‌బీఐ నుంచి వచ్చే మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను పరిశీలించడం మంచి అలవాటు. ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ను అర్థం చేసుకోవడం ద్వారా తగిన విధంగా తమ ఖర్చులను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ మార్పులు అన్ని ఎస్‌బీఐ కార్డులకు వర్తించవు. కొన్ని ఎంపిక చేసిన కార్డులకే ఇవి వర్తిస్తాయి. అయినప్పటికీ ఈ మార్పులు ప్రభావం చూపే వినియోగదారులు గమనించాల్సిన విషయమేమిటంటే – క్రెడిట్ కార్డు వినియోగాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే పెనుబాధ్యతలు ఎదురయ్యే అవకాశం ఉంది.

88
నెలవారీ బిల్లు

ఈ మార్పుల నేపథ్యంలో వినియోగదారులకు ముఖ్యమైన సూచన ఏమిటంటే – నెలవారీ బిల్లు వచ్చిన వెంటనే పూర్తి మొత్తాన్ని చెల్లించడం ద్వారా వడ్డీలను, ఇతర ఛార్జీలను నివారించవచ్చు. అలాగే, ఏదైనా ప్రయోజనం అందుతోందంటే దానిపై స్పష్టమైన సమాచారం తెలుసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఏ మార్పు వచ్చినా తక్కువ ప్రభావమే ఉంటుంది.

అంతేకాకుండా, బ్యాంకులు ఏ మార్పు చేసినా తమ అధికారిక వెబ్‌సైట్‌ లేదా కస్టమర్ కేర్ ద్వారా వివరాలు పరిశీలించి, వాటిని అర్థం చేసుకుని ఉపయోగించుకోవడమే మేలైన మార్గం.

Read more Photos on
click me!

Recommended Stories