MRF Shares: 1989లో కేవలం రూ. 44 వద్ద ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర, 34 ఏళ్లలో రూ. 1.30 లక్షల మార్కును దాటింది. అంటే సుమారు 2200 రెట్లు లాభాన్ని అందించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందామా..
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక షేర్ ధర లక్ష రూపాయల మార్కును దాటడం అనేది అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఆ ఘనత సాధించిన మొదటి కంపెనీ ఎంఆర్ఎఫ్(MRF). దీర్ఘకాలిక పెట్టుబడి(Long-term Investment) ఎంతటి సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి ఎంఆర్ఎఫ్ షేర్ ఒక తిరుగులేని ఉదాహరణగా నిలిచింది.
25
రూ. 44 నుండి లక్షాధికారిగా:
స్టాక్ మార్కెట్ నిపుణులు, పాతతరం ఇన్వెస్టర్లు తరచూ ఎంఆర్ఎఫ్ షేర్ గురించి చర్చించుకుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ అనే వ్యక్తి తన కుటుంబ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1989లో ఎంఆర్ఎఫ్ షేర్ ధర కేవలం రూ. 44 నుంచి రూ. 45 మధ్య ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. గత 34-36 ఏళ్ల కాలంలో ఆ షేర్ విలువ ఊహించని రీతిలో పెరిగి ప్రస్తుతం రూ. 1.30 లక్షల మార్కును దాటింది. అంటే, ఆయన పెట్టిన పెట్టుబడి దాదాపు 2200 రెట్లు లాభాన్ని అందించింది.
35
షేర్ ధర పెరగడమే కాకుండా
కేవలం షేర్ ధర పెరగడమే కాకుండా, కంపెనీ ఏటా ప్రకటించే డివిడెండ్‌ల రూపంలో కూడా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చాయి. సిద్ధార్థ్ మాటల్లో చెప్పాలంటే, ఆయన పెట్టిన అసలు పెట్టుబడి ఎప్పుడో డివిడెండ్‌ల రూపంలో తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఆయన వద్ద ఉన్న షేర్లు పూర్తిగా ఉచితంగా వచ్చినట్లే లెక్క. భవిష్యత్తులో కంపెనీ షేర్ స్ప్లిట్ లేదా బోనస్ షేర్లు ప్రకటిస్తే, ఇన్వెస్టర్ల సంపద ఇంకా కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది.
ఎంఆర్ఎఫ్ వంటి బ్లూ-చిప్ కంపెనీలు దీర్ఘకాలికంగా ఎంతటి స్థిరత్వాన్ని, వృద్ధిని ఇస్తాయో ఈ ఉదాహరణ చెబుతుంది. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా, మంచి పునాది ఉన్న కంపెనీల్లో ఓపికగా పెట్టుబడి పెడితే, అది తరతరాలకు సరిపడా సంపదను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
55
స్టాక్ మార్కెట్ అసలైన మ్యాజిక్
అయితే, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వ్యాపార నమూనాను అధ్యయనం చేయడం, ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం తప్పనిసరి. కాగా, 1989లో ఎంఆర్ఎఫ్ షేర్‌లో పెట్టిన కొన్ని వేల రూపాయలు నేడు కోట్ల రూపాయల విలువైన ఆస్తిగా మారాయి. ఇదే స్టాక్ మార్కెట్ అసలైన మ్యాజిక్!