Gold Silver Price: అనుకుందే జ‌రిగింది.. కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

Published : Jan 31, 2026, 09:50 AM IST

Gold Silver Price: అనుకున్న‌ట్లే జ‌రిగింది. ఆకాశ‌మే హ‌ద్దుగా పెరుగుతోన్న బంగారం, వెండి ధ‌ర‌లు బ్రేక్ ప‌డ‌నుంద‌ని చెప్పిన నిపుణుల మాట‌లు నిజ‌మ‌య్యాయి. శుక్ర‌వారం బంగారం, వెండి ధ‌ర‌లు ఒక్క‌సారిగా కుదేల‌య్యాయి. ప్ర‌స్తుతం వీటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే. 

PREV
15
ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

ఇటీవలి కాలంలో ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలకు శుక్రవారం ఒక్కసారిగా భారీ బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రారంభమైన అమ్మకాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా తీవ్రంగా పడింది. గంటల వ్యవధిలోనే ధరలు భారీగా క్షీణించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

25
అంతర్జాతీయ మార్కెట్లో భారీ పతనం

అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర ఒక్కరోజులోనే సుమారు 11 శాతం తగ్గి 4,732 డాలర్లకు చేరింది. అదే సమయంలో వెండి ధర మరింత తీవ్రంగా పడిపోయి దాదాపు 32 శాతం నష్టంతో 78 డాలర్ల వద్ద స్థిరపడింది. గత 15 ఏళ్లలో ఇంత భారీ ఒక్కరోజు పతనం అరుదైనదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

35
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పరిస్థితి

అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.21,860కు పైగా తగ్గి రూ.1,69,200గా నమోదైంది. కాగా శ‌నివారం కూడా బంగారం ధ‌ర‌లో భారీ త‌గ్గుద‌ల క‌నిపించింది. శ‌నివారం రూ. 8620 త‌గ్గి రూ. 1,60,580 వ‌ద్ద కొన‌సాగుతోంది. వెండి ధ‌ర‌లో కూడా భారీగా త‌గ్గుద‌ల క‌నిపించింది. శ‌నివారం హైద‌రాబాద్‌లో కిలో వెండి ధ‌ర రూ. 3.5 ల‌క్ష‌ల వ‌ద్ద కొన‌సాగుతోంది. ఒక్క‌రోజులోనే వెండి ధ‌ర దాదాపు రూ. 45 వేలు త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.

45
MCX ఫ్యూచర్స్‌లో భారీ ఒడిదుడుకులు

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ట్రేడింగ్ సమయంలో తీవ్ర ఊగిసలాట కనిపించింది. ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించిన 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.1,80,499 వద్ద ప్రారంభమై, మధ్యలో రూ.1,83,493 వరకు చేరింది. అనంతరం భారీగా పడిపోయి రూ.1,50,849 వద్ద ముగిసింది. ఇది దాదాపు 18 శాతం నష్టం. వెండి మార్చి కాంట్రాక్టు ధర కూడా అదే బాటలో నడిచింది. రూ.3,83,898 వద్ద ప్రారంభమైన ధర, రూ.3,89,986 వరకు వెళ్లి, చివరకు రూ.2,91,922 వద్ద ముగిసింది. మొత్తం మీద 27 శాతం నష్టం నమోదైంది.

55
పతనానికి కారణాలు ఏమిటి?

ధరలు ఊహించని గరిష్ఠస్థాయిలకు చేరడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు అమెరికా డాలర్ తిరిగి బలపడటం, ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన అంచనాలు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్న సంకేతాలు కూడా విలువైన లోహాలపై ఒత్తిడి తెచ్చాయి. షార్ట్ సెల్లింగ్ పెరగడం వెండి ధరపై మరింత భారాన్ని మోపింది. ఫలితంగా బంగారం, వెండి మార్కెట్లలో తాత్కాలిక అస్థిరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త అవసరం అని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డాలర్ విలువ పెరగడం, యుద్ధవాతావరణం తగ్గడం వంటి అంశాలు దీనికి కారణాలుగా అభిప్రాయపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories