Gold Price: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తగ్గకపోతుందా అని అనుకున్న వారి ఆశలను నిరాశ చేస్తూ పైపైకి దూసుకుపోతోంది. 2025లో చుక్కలు చూపించిన గోల్డ్ ప్రైజ్ వచ్చే ఏడాది కూడా అదే దారిలో నడుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2025 ఏడాది బంగారం మార్కెట్‌కు చరిత్రాత్మకంగా మారింది. సంవత్సరం ఆరంభంలో రూ.78 వేల దగ్గర ఉన్న 10 గ్రాముల పసిడి ధర క్రమంగా పెరుగుతూ ఒక దశలో రూ.1.37 లక్షలు దాటింది. మధ్యలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించినా మొత్తం ఏడాది ట్రెండ్ మాత్రం పైకే సాగింది. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా ఎంచుకోవడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.
25
2026లో పసిడి రేటుపై అంతర్జాతీయ అంచనాలు
వచ్చే ఏడాది బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ప్రస్తుత స్థాయిల నుంచి 15 నుంచి 30 శాతం వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. గోల్డ్‌మన్ శాక్స్ రిపోర్ట్ ప్రకారం 2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరవచ్చు. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే రూ.1.60 లక్షలు దాటే ఛాన్స్ కూడా ఉందని ఆ సంస్థ చెబుతోంది.
35
బంగారం ధర పెరగడానికి కారణాలు.?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అమెరికా టారిఫ్ విధానాలు, వాణిజ్య యుద్ధాల భయం పెట్టుబడిదారులను స్టాక్ మార్కెట్ల నుంచి దూరం చేస్తున్నాయి. ఈ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. అదే విధంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు కూడా బంగారానికి అనుకూలంగా మారాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో పసిడి విలువ 60 శాతం పైగా పెరిగింది.
పెళ్లిళ్ల సీజన్ ఒక్కటే బంగారం ధర పెరుగుదలకు కారణం కాదు. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ తగ్గుతుండటం ప్రజలను బంగారం వైపు నడిపిస్తోంది. దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక భద్రతపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇదే సమయంలో సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు భారీ అప్పుల్లో కూరుకుపోవడం కూడా పసిడి డిమాండ్‌ను మరింత పెంచుతోంది.
55
పెట్టుబడిదారులకు లాభం.. కొనుగోలుదారులకు భారం
ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారికి ఈ ధరల పెరుగుదల పెద్ద లాభంగా మారుతోంది. గోల్డ్ ఒక ఆభరణం మాత్రమే కాదు, ఆర్థిక అనిశ్చితి సమయంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. రాబర్ట్ కియోసాకి వంటి ఆర్థిక విశ్లేషకులు కూడా గోల్డ్ పెట్టుబడిని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఆభరణాల కోసం బంగారం కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఈ ధరలు తీవ్ర భారంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పసిడి సామాన్యులకు అందని స్థాయికి చేరే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.