గౌతమ్ అదానీ తన విజయం వెనుక గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ పాలసీల్లో మార్పులు, సరళీకృత ఆర్థిక విధానాలు, సంస్థాగత సంస్కరణలే కారణమని తెలిపారు. అదానీ గ్రూప్ విజయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణ విధానాలే కారణమని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అదానీ గ్రూప్ విజయం ఏ ఒక్క నాయకుడి వల్ల అవలేదని, ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ తెలిపారు. తాను, ప్రధాని నరేంద్ర మోదీ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో అదానీ గ్రూప్ వృద్ధిపై తరచూ నిరాధార ఆరోపణలు వస్తున్నాయని అదానీ అన్నారు.
అదానీ గ్రూప్ విజయం ఏ ఒక్క నాయకుడి వల్ల కాదని, మూడు దశాబ్దాలకు పైగా అనేక మంది నాయకులు ప్రభుత్వాలు ప్రారంభించిన విధాన, సంస్థాగత సంస్కరణల వల్లనే అని అదానీ ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
అదానీ గ్రూప్ పవర్ ప్లాంట్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి విభిన్న వ్యాపారాలను నిర్వహిస్తుంది. 150 బిలియన్ డాలర్ల వ్యక్తిగత నికర ఆస్తి విలువతో, అదానీ ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. అయితే గౌతమ్ అదానీ ఈ ఇంటర్వ్యూలో తాను కమోడిటీ ట్రేడింగ్ ద్వారా తన ఆంత్రప్రెన్యూర్ ప్రయాణాన్ని ప్రారంభించానని, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తన ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించగా, పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా తమ పరిశ్రమలో పురోగతి వచ్చిందని అదానీ అన్నారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ విధానపరమైన కార్యక్రమాల వల్ల పారిశ్రామికవేత్తలకు ఊపు వచ్చిందని. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఎన్నిక కావడం, ఆ తర్వాత విధాన సంస్కరణలు అదానీ గ్రూపు అభివృద్ధిలో కీలక మలుపుగా మారాయన్నారు.
ఇక ఎన్డీటీవీ కొనుగోలు విషయంలో కూడా అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ వ్యవస్థాపకులు తమ వాటాలను విక్రయించాలనే నిర్ణయంతో ఎన్‌డిటివిలో అదానీ గ్రూప్ 65 శాతం వాటాను కొనుగోలు చేసిందని తెలిపారు. అంతేకాదు ఎన్డీటీవీ ఎడిటోరియల్ స్వతంత్రతను కొనసాగిస్తామని అదానీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ సంవత్సరం, అదానీ గ్రూప్ ACC, అంబుజా సిమెంట్స్‌లను సుమారు 10.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అవతరించిందని, కానీ ఈ కొనుగోళ్లు గ్రూప్ రుణ ప్రొఫైల్ గురించి ప్రశ్నలను లేవనెత్తాయి. "గత తొమ్మిదేళ్లుగా, మా లాభాలు అప్పుల రేటు కంటే రెండింతలు పెరుగుతున్నాయి, కాబట్టి వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనకు ముందు మా రుణ-ఆదాయ నిష్పత్తి 7.6 నుండి 3.2కి తగ్గింది" అని అదానీ ఎత్తి చూపారు.
“తొమ్మిదేళ్ల క్రితం, తమ గ్రూపు మొత్తం రుణంలో 86 శాతం భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్నవే ఉండేవని, కానీ ఇప్పుడు మొత్తం క్రెడిట్‌లో భారతీయ బ్యాంకుల వాటా 32 శాతానికి పడిపోయింది. తమ గ్రూపు రుణంలో 50 శాతం అంతర్జాతీయ బాండ్ల ద్వారానే వస్తోందని అదానీ తెలిపారు.