అదానీ గ్రూప్స్ అదరగొట్టింది.. ఇలాంటి ప్రపంచ ఘనత సాధించడం చాలా గ్రేట్

First Published | Sep 14, 2024, 5:05 PM IST

ఇండియాలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన గౌతమ్ అదానీ.. తన వ్యాపార సంస్థల ద్వారా ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని చేరుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన కంపెనీలు సాధిస్తున్న అభివృద్ధి ఆధారంగా త్వరలో ఆయన ఇండియాలోనే మొట్టమొదటి ట్రిలీనియర్ కూడా కాబోతున్నారు. ఇది ఇలా ఉండగా అదానీ గ్రూప్స్ మరో గొప్ప మైలు రాయిని దాటాయి. అదేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గౌతమ్ అదానీ భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఎప్పుడో చోటు సంపాదించారు. అంబానీ, అదానీ ఇద్దరూ సంపన్నుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి పోటీ పడుతుంటారు. ఇద్దరి కంపెనీలు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి కంపెనీల మధ్య పోటీని తెలియజేస్తాయి. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైమ్స్ సంస్థ 2024కు సంబంధించి ప్రపంచంలో బెస్ట్ కంపెనీల లిస్టును విడుదల చేసింది. 
 

టైమ్స్ 2024 ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్స్ స్థానం సంపాదించింది. స్టాటిస్టికల్ పోర్టల్ స్టాటిస్టా అనే సర్వే సంస్థతో కలిసి టైమ్స్ ఈ డేటాను సంపాదించింది. సాధారణంగా టైమ్స్ విడుదల చేసే లిస్టులో చోటు సంపాదించుకోవడం చాలా గ్రేట్. అలాంటిది అదానీ గ్రూప్స్ చోటు దక్కించుకోవడంపై అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ టైమ్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.


ఉద్యోగుల సంతృప్తి వల్లే ఈ ర్యాంకు..
టైమ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీల్లో ఉద్యోగుల సంతృప్తి, ఆదాయంలో పెరుగుదల, స్థిరత్వంపై నిబద్ధత అనే అంశాలపై సర్వే నిర్వహించింది. ఈ అంశాలన్నింటిలో అదానీ గ్రూప్స్ మంచి రిజల్ట్స్ చూపించింది. దీంతో టైమ్స్ జాబితాలో 736 ర్యాంకు సాధించింది. ఈ గౌరవంతో తన గ్రూప్ విస్తరణ మరింత వేగంగా జరుగుతుందని గౌతమ్ అదానీ సంతోషం వ్యక్తం చేశారు. 
 

అదానీ గ్రూప్స్ తన 11 కంపెనీలను ఈ సర్వే జాబితాలో చేర్చారు. అయితే 8 కంపెనీలను మాత్రమే టైమ్స్ పరిగణించింది. మిగిలిన మూడు కంపెనీలు ఈ ఎనిమిది కంపెనీల అనుబంధ సంస్థలని గ్రూప్ తెలిపింది. మూల్యాంకనం తర్వాత, దాని పనితీరు ఆధారంగా గ్రూప్ ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలలో స్థానం పొందింది. అదానీ గ్రూప్స్ గుర్తింపు పొందిన కంపెనీలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్, అదానీ విల్మర్ లిమిటెడ్ ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఈ సర్వే జరిగింది. అన్ని కంపెనీల్లో కలిపి 1,70,000 మంది ఉద్యోగులను టైమ్స్, స్టాటిస్టా సంస్థలు వివరాలు అడిగాయి. పనిచేయడంలో ఇబ్బందులు, యాజమాన్య సంస్థ ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, సాలరీలు, భద్రత తదితర విషయాలపై వివరాలు సేకరించారు. అంతే కాకుండా ఆయా సంస్థల రెవన్యూ గ్రోత్ ను కూడా పరిగణించాయి. ఇలా అనేక విషయాలను విశ్లేషించి ప్రపంచంలోనే టాప్ 1000 కంపెనీల లిస్టును విడుదల చేశాయి. అందులో అదానీ గ్రూప్స్ చోటు దక్కించుకున్నాయి. 

అదానీ గ్రూప్స్ కాకుండా భారత దేశానికి చెందిన మరికొన్ని కంపెనీలు టైమ్స్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. వాటిల్లో హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి మరో 22 కంపెనీలు ఉన్నాయి. 

Latest Videos

click me!