రెనాల్ట్, మహీంద్రాలతో సై: మార్కెట్లోకి కొత్త మారుతి ఎస్‌యూవీ

First Published | Jul 31, 2019, 1:19 PM IST

వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ కారును రూపుదిద్దింది. సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న ఎస్‌–ప్రెస్సో కారు ధర రూ.5 లక్షలుగా ఉంటుందని అంచనా.  

ప్రయాణికుల వాహనాల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మాస్‌ మార్కెట్‌ లక్ష్యంగా రూపొందించిన చిన్న ఎస్‌యూవీ కారు ‘ఎస్‌–ప్రెస్సో’ త్వరలో రోడ్డెక్కనున్నది. సెప్టెంబర్ నెలలోఈ కారు విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్‌ నోయిడాలో గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి కాన్సెప్ట్‌ కారును ప్రదర్శించింది.
మారుతి సుజుకి నుంచి వెలువడే అతి చిన్న ఎస్‌యూవీ ఇదే కావడం గమనార్హం. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వితారా బ్రెజ్జా కంటే ఇది చిన్నగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ మోడల్ కారు కోరుకునేవారికి ఇది బెస్ట్‌ చాయిస్‌గా నిలుస్తుందని మారుతి సుజుకి భావిస్తోంది.

బీఎస్‌–6 ప్రమాణాలతో 1.2 పెట్రోల్‌ ఇంజన్, 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకుంది. ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) మోడల్‌ కూడా రానున్నది. సీఎన్జీ వేరియంట్‌ను సైతం త్వరలో ప్రవేశపెట్టనుంది. బేస్‌ వేరియంట్‌ రూ.5 లక్షల లోపు ఉండే అవకాశముంది.
మారుతి సుజుకి విడుదల చేయనున్న బుల్లి ఎస్‌యూవీ మోడల్ కారు వేరియంట్‌ను బట్టి ధర రూ.8 లక్షల దాకా ఉండొచ్చు. యువతను దృష్టిలో పెట్టుకుని మోడర్న్‌ స్టైలింగ్, క్యాబిన్‌ ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఆధునిక టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్‌ వంటివి అదనపు ఫీచర్లు జత కలిశాయి.
అంతే కాదు మహీంద్రా అండ్ మహీంద్రా కేయూవీ 100, రెనాల్డ్ క్విడ్ మోడల్ కార్లతో త్వరలో విపణిలో అడుగు పెట్టనున్న మారుతి సుజుకి బుల్లి ఎస్‪యూవీ కారు తలపడుతుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి సెలెరియోలో మాదిరిగా క్యాబిన్, డార్క్ ఇంటిరియర్ కలర్ స్కీమ్స్ ఉంటాయి. ఇంకా మారుతి సుజుకి బాలెనో, వాగన్ ఆర్, స్విఫ్ట్ మోడల్ కార్లలోని స్పెషల్ ఫీచర్లు బుల్లి ఎస్‌యూవీ కారులో జత కలువనున్నాయి.

Latest Videos

click me!