తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

First Published Aug 19, 2021, 11:45 AM IST

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఉదయం  తిరుమలకు చేరుకుని కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి దగ్గరుండి దర్శనం చేయించారు. 

తిరుపతి: ఇటీవలే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రిగా బాధ్యతల చేపట్టిన కిషన్ రెడ్డి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడినుండి నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. 

తిరుమలకు చేరుకున్న కిషన్ రెడ్డికి టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరందరికి టిటిడి ఛైర్మన్ దగ్గరుండి దర్శనం చేయించారు.
 

ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో కిషన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే కేంద్ర మంత్రి హోదాలో ఆలయానికి విచ్చేసిన కిషన్ రెడ్డికి శాలువాతో సత్కరించారు.  

వెంకన్న దర్శనం అనంతరం తిరుపతికి చేరుకున్న కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు. కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర నేపధ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు రేణిగుంట కాటన్ మిల్లు, రామానుజ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద వరకు బైక్ ర్యాలీ జరిగింది. 
 

click me!