షియోమీ సరికొత్త రికార్డు: ఐదేళ్లలో 10 కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయం

By Siva Kodati  |  First Published Sep 8, 2019, 12:12 PM IST

అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల విక్రయ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఐదేళ్లలో 10 కోట్ల స్మార్ట్ ఫోన్లు భారతదేశంలోనే విక్రయించింది. అంతర్జాతీయంగా ఏ ఇతర సంస్థ ఈ ఫీట్ సాధించలేదని, ఇది తమకు మైలురాయి అని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు


చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షియోమీ భారతదేశంలో జరిగిన సేల్స్‌లో రికార్డు సొంతం చేసుకున్నది. గత ఐదేళ్లలోనే భారతదేశంలో 10 కోట్లకు పైగా స్మార్ట్ పోన్లను విక్రయించామని షియోమీ తెలిపింది. ప్రారంభం నుంచి ఎంఐ ఫ్యాన్స్ నుంచి తమకు లభిస్తున్న ఆదరణకు ఇదే నిదర్శనమని షియోమీ పేర్కొన్నది. 

తమ సంస్థ కంటే ముందు మార్కెట్లో పలు బ్రాండ్లు ఉన్నా తాము సాధించిన ఈ అద్భుతమైన విజయాలను ఏ సంస్థ సాధించలేకపోయిందని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. ఇందుకు తమ వినియోగదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. షియోమీ సంస్థ సాధించిన ఘనతను ఉద్యోగులతో పంచుకున్నారు. 

Latest Videos

తమ టీం సంతోషంగా జరుపుకున్న సంబురాల వీడియోను ట్వీట్ చేశారు. 2014 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి ఈ ఏడాది జూలై వరకు షియోమీ ఫోన్ల విక్రయాలు 100 మిలియన్ల మైలురాయిని దాటాయని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది.

మరీ ప్రత్యేకించి రెడ్ మీ ఏ, రెడ్ మీ నోట్ సిరీస్ ఫోన్లు భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రెండు స్మార్ట్ ఫోన్లుగా నిలిచాయని పేర్కొన్నది. షియోమీ వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో భారతదేశంలో అగ్రశ్రేణి స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.

అంతర్జాతీయంగా ఏ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూడా ఈ రికార్డు సాదించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో రెడ్ మీ 6ఎ, రెడ్ మీ నోట్ 7 ప్రో అత్యధికంగా అమ్ముడైన రెండు స్మార్ట్ ఫోన్లుగా నిలిచాయి. 

షియోమీతోపాటు చైనాలో ఒప్పో, వివో తదితర సంస్థలు ఉన్నా.. వాటిని దాటుకుని షియోమీ భారత విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం. ‘ప్రపంచంలోని ఏ దేశంలోనూ, మార్కెట్‌లోనూ ఐదేళ్లలో ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ 100 మిలియన్ల ఫోన్లను విక్రయించలేదు. ఇది మాకు ఒక మైలు రాయి’ అని మనుకుమార్ జైన్ తెలిపారు.

ఆన్ లైన్ మార్కెట్లో 46.5 శాతం, ఆఫ్ లైన్ విక్రయాల్లో 28.3 శాతం వాటా పొందిన షియోమీ.. ఇతర బ్రాండ్లకు ధీటుగా నిలిచిందని ఐడీసీ పేర్కొంది. 

click me!