భారత విపణిలోకి చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.37,999 నుంచి ప్రారంభం కానున్నది.
ప్రముఖ చైనామొబైళ్ల తయారీ సంస్థ రియల్ మీ భారత విపణిలోకి తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5జీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎక్స్50 ప్రొ ప్రారంభ ధరను రూ.37,999గా నిర్ణయించింది. కంపెనీ విడుదల చేసిన అత్యంత విలువైన ఫోన్ ఇదే కావడం విశేషం.
‘భారత మార్కెట్లోకి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడం గర్వంగా ఉన్నది..అత్యంత వేగవంతంగాను, పనితీరులోనూ ఈ ఫోన్ చరిత్ర సృష్టించనున్నది’ అని రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు.
మూడు రకాల్లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్ రూ.37,999, రూ.39,999, రూ.44,999గా ధరలను నిర్ణయించిందని మాధవ్ సేథ్ పేర్కొన్నారు. డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో 4జీ, 5జీ సేవలు పొందవచ్చునని ఆయన చెప్పారు.
రియల్ మీ ఎక్స్ పో ఆండ్రాయిడ్ 10తో కూడిన రియల్ మీ యూఐతో పని చేస్తుంది. 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 90హెచ్జడ్ రీఫ్రెష్ రేట్ గల సూపర్ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఈ ఫోనుకు ఉంది. స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ గల ఈ ఫోన్ వెనుక వైపు 65 ఎంపీ శామ్ సంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ టెలీఫొటో సెన్సర్, 2 ఎంపీ పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి.
ముందు వైపు 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 616 కెమెరా అమర్చారు. అదనంగా 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరాను వినియోగించారు. 5జీ కనెక్టివిటీతోపాటు 4జీ వీవోల్టీఈ, వైఫై6, బ్లూ టూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఇన్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్ లో లభించే ఫీచర్లు, ఇది 4200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంది.
ఇదిలా ఉంటే రియల్ మీ అనుబంధ సంస్థ రియల్‌మీ పైసా ఆర్థిక సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. రుణాలు, పొదుపు, చెల్లింపులు, బీమా రంగంలో సేవలు అందించనునున్నట్లు కంపెనీ అధినేత వరుణ్ శ్రీధర్ తెలిపారు. రూ.8 వేల నుంచి రూ. లక్ష లోపు వ్యక్తిగత రుణాలు ఈ సంస్థ అందించనున్నది.
రూ.50 వేల నుంచి రూ.5 లక్షల లోపు వ్యాపార రుణాలు ఇస్తున్నట్లు కంపెనీ అధినేత వరుణ్ శ్రీధర్ చెప్పారు. వ్యక్తిగత రుణాలపై 14 శాతం నుంచి 36 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్న సంస్థ..వ్యాపార రుణాలపై 11-24 శాతం లోపు విధిస్తున్నది.
మరోవైపు వీ-వర్క్‌తో కలిసి హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు రియల్‌మీ పైసా అధినేత వరుణ్ శ్రీధర్ ప్రకటించారు. ఈ హ్యాకథాన్‌లో గెలుపొందిన వారిలో మొదటి బహుమతి కింద రూ.10 లక్షలు, రెండో బహుమతి కింద రూ.5 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు.