FIFA: ఆ ఒక్క స్పీచ్‌తో రెచ్చిపోయిన సౌదీ ఆటగాళ్లు.. సై సినిమాను గుర్తుకు తెచ్చిన హెడ్ కోచ్

By Srinivas M  |  First Published Nov 28, 2022, 11:48 AM IST

FIFA World Cup 2022: ఒక జట్టుకు  కోచ్ గా ఉన్నవ్యక్తి వాళ్లకు మార్గనిర్దేశకుడిగా ఉండాలి. ఆటగాళ్లలో స్ఫూర్తి రగిలించాలి. గెలవాలన్న కసి వాళ్లలో నింపాలి.   అప్పుడే ఆ పోస్టుకు అతడు న్యాయం చేసినవాడవుతాడు. 


క్రీడల్లో గెలుపోటములు సర్వ సాధారణమే. కానీ కీలక మ్యాచ్ లలో  ఓటమి అంచున ఉన్న జట్లు  గెలవడం  అంత ఆషామాషీ కాదు. అదీ పటిష్ట ప్రత్యర్థుల మీద అయితే  అది  వేరే  లెవల్. వ్యక్తిగతంగా ఆడే ఆటల్లో కంటే   గ్రూప్ గా ఆడే క్రీడల్లో  సమన్వయం ముఖ్యం. ఆటగాళ్లందరినీ ఒక్కతాటి పైకి తీసుకువచ్చి వారిలో గెలవాలన్న  స్ఫూర్తి రగిలించడం కీలకం.  క్రికెట్, రగ్బీ, ఫుట్‌బాల్, హాకీ వంటి ఎక్కువసేపు జరిగే  ఆటల్లో అయితే కొద్దిసమయం తర్వాత  పుంజుకునేలా చేయడం కష్టమైన పనే.. కానీ  జట్టుగా చేసే పోరాటం   ఎప్పటికీ  వృథాగా పోదు. అలా పోరాడటానికి కూడా  గ్రూప్ లోని ఆటగాళ్లను సరైన మార్గదర్శకంలో నడిపే నాయకుడు, నాయకుడితో పాటు ఆటగాళ్లందరికీ  బాట చూపే మార్గనిర్దేశకుడు కావాలి. పైన పేర్కొన్న అన్ని క్రీడల్లో  ఈ పనిని తూచా తప్పకుండా నిర్వర్తించేవాడు హెడ్ కోచ్. 

ఫుట్‌బాల్   క్రీడ కూడా రెండు భాగాలుగా జరుగుతుంది. మొదటి హాఫ్ (45 నిమిషాలు) తర్వాత సెకండ్ హాఫ్ ఆడాల్సి ఉంటుంది.  ఫస్ట్  హాఫ్ లో  సరిగ్గా ఆడకపోయినా సెకండ్ హాఫ్ లో రెచ్చిపోతే విజయం తథ్యం అని గతంలో చాలా జట్లు నిరూపించాయి.  ఇటీవలే  ఫిఫా ప్రపంచకప్ లో సౌదీ అరేబియా కూడా ఇదే అద్భుతం చేసింది. 

Latest Videos

undefined

ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా  సౌదీ.. తమ తొలి మ్యాచ్ ను టోర్నీ ఫేవరేట్లు.. 36 మ్యాచ్ లలో వరుసవిజయాలతో దూకుడుమీదున్న అర్జెంటీనాతో ఆడింది.  తొలి అర్థభాగంలో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ..  గోల్ చేశాడు.  దాదాపు ఫస్టాఫ్ అంతా అర్జెంటీనాదే పైచేయి.  ఫస్టాఫ్ ముగిసింది. బ్రేక్ టైమ్.  

స్ఫూర్తి రగిలింది.. సౌదీ గెలిచింది.. 

సౌదీ టీమ్ అంతా  నిరాశ, నిస్పృహలతో కూర్చుని ఉంది. అప్పుడొచ్చాడు హెచ్ కోచ్ హెర్వ్ రెనార్డ్. ‘ఇక ఓటమి తప్పదు..’ అనుకుని కుంగిపోతున్న  సౌదీ ఆటగాళ్ల వైపు చూశాడు. వాళ్లను చూస్తే అతడికే అసహ్యం వేసింది. కానీ ఇప్పుడు వాళ్లపై చూపించాల్సింది జాలి కాదు.. స్ఫూర్తి రగిలించాలి..  గెలవాలన్న కసి వారిలో నింపాలి.  ప్రత్యర్థిజట్టులో మెస్సీ కాదు మరడోనా, పీలేలు ఉన్నా భయపడాల్సిన పన్లేదని చాటిచెప్పాడు. రెండు నిమిషాల పాటు  డ్రెస్సింగ్ రూమ్ అంతా  రెనార్డ్  స్పీచ్ తో దద్దరిల్లింది.   మందలిస్తూనే వారిలో గెలవాలనే కాంక్షను రగిల్చాడు.  ఈ స్పీచ్ ముగిసిన సరిగ్గా 45 నిమిషాల తర్వాత.. 0-1తో వెనుకబడి  ఉన్న సౌదీ.. 2-1తో అర్జెంటీనా ను ఓడించి అనూహ్య విజయాన్ని  అందుకుంది.  

 

ఏం చెప్పాడు..? 

ఫస్టాఫ్  ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి నిరాశగా ఉన్న ఆటగాళ్ల దగ్గరికి వచ్చిన  రెనార్డ్.. ‘ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాం. ఇక్కడేమైనా ప్రెస్ మీట్ ఉందా..?  అక్కడ (గ్రౌండ్ లో) మెస్సీ  బాల్ తో దూసుకొస్తున్నాడు. కానీ మీరు అతడి ముందు బిత్తరపోయి చూస్తున్నారు. అతడిని అడ్డుకోవాలని మీకు తెలియదా..? మీకు మెస్సీతో ఫోటో దిగాలని అనిపిస్తే వెళ్లి మీ ఫోన్ తీసుకుని ఫోటోలు దిగండి.  కానీ డిఫెన్స్  చేసేప్పుడు బిత్తరచూపులు కాదు. అటెన్షన్ గా ఉండండి.  బంతి మీద కాన్సంట్రేట్ చేయండి.  మన దగ్గర బాల్ ఉన్నప్పుడు మీరు చాలా బాగా ఆడుతున్నారు. మీరు ఈ గేమ్ లో తిరిగి   పుంజుకోగలరని మీరు నమ్మడం లేదా..? కమాన్, కమాన్.. ఇది ప్రపంచకప్.  కడదాకా పోరాడండి. నెవర్ గివ్ అప్...’ అంటూ ఊగిపోతూ ఇచ్చిన స్పీచ్ తో  సౌదీ ఆటగాళ్లలో గెలవాలన్న కాంక్ష వందింతలు  పెరిగింది. 

అచ్చం సై సినిమానే.. 

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సీన్ చూస్తుంటే అచ్చం  సై సినిమాలో చివర్లో రగ్బీ ఆడుతూ.. నితిన్ జట్టు ఓడిపోతుంటే   రాజీవ్ కనకాల ఇచ్చే మోటివేషనల్ స్పీచ్ మాదిరిగానే ఉంది.  రెండూ కలిపి చూడండి.  మీరే అంటారు సేమ్ టు సేమ్ అని.. 

 

click me!