2020లో అత్యధిక మొత్తం ఆర్జించిన ఫుట్‌బాల్ క్రీడాకారుల జాబితాలో మెస్సీ టాప్‌లో నిలిచాడు. రొనాల్డో రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారులు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఎప్పుడూ హోరాహోరీ పోటీ జరుగుతూనే ఉంటుంది. ఆట వరకూ పోటీదారులుగా ఉండే ఈ ఇద్దరూ, బయట మంచి స్నేహితులు కూడా. రొనాల్డో, మెస్సీ ఇద్దరిలో ఎవరు టాప్... అంటే చెప్పడం కష్టం.
కొందరు మెస్సీయే టాప్ అంటే, మరికొందరు రొనాల్డోనే తోపు అంటారు. అయితే ఓ విషయంలో మాత్రం మెస్సీ, రొనాల్డోను వెనక్కినెట్టి టాప్‌లోకి వెళ్లాడు. 2020లో అత్యధిక మొత్తం ఆర్జించిన ఫుట్‌బాల్ క్రీడాకారుల జాబితాలో మెస్సీ టాప్‌లో నిలిచాడు. మెస్సీ ఈ ఏడాదిలో రూ. 927 కోట్ల ఆదాయం ఆర్జిస్తే... అందులో యాడ్స్ ద్వారా వచ్చిందే రూ.250 కోట్లు. రొనాల్డో రూ. 861 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెమర్ జూనియర్ రూ. 706 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కిలియన్ బప్పే, మెహమ్మద్ సలా, పాల్ పోబా, ఆంటోనీ గ్రీజ్‌మన్, గరెత్ బాలె, రాబర్ట్ లెవడొస్కీ, డేవిడ్ డి జీ వరుసగా టాప్ 10 స్థానాల్లో ఉన్నారు.