FIFA: ఫిఫా ప్రపంచకప్ చూడటానికి 1600 కిలోమీటర్ల పాదయాత్ర.. అరేబియన్ ఎడారిలో ఒక్కడే..

By Srinivas MFirst Published Nov 7, 2022, 1:33 PM IST
Highlights

FIFA World Cup 2022: ఈనెల 20 నుంచి ఎడారి దేశం ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఫు‌ట్‌బాల్ ఫీవర్ పట్టుకుంది. ఈ  మెగా ఈవెంట్ ను  ప్రత్యక్షంగా చూడాలని ఓ యువకుడు 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. 

ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారిగా గల్ఫ్ దేశాల్లో జరుగబోతున్న ఫిఫా వరల్డ్ కప్ - 2022 ను ప్రత్యక్షంగా చూసేందుకు ఆ రీజియన్ లో ఉన్న   ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18వరకు ఖతార్  వేదికగా జరుగబోయే  ఈ భారీ టోర్నీని ప్రత్యక్షంగా చూసేందుకు సౌదీ అరేబియాకు చెందిన ఓ  అభిమాని ఏకంగా 1,600 కిలోమీటర్లు ప్రయాణించాడు. అరేబియన్ ఎడారిని దాటుకుని జెడ్డా (సౌదీ అరేబియా) నుంచి దోహా (ఖతార్) చేరాడు. 55 రోజుల పాటు సాగిన అతడి ప్రయాణం గురించిన వివరాలివి.. 

సౌదీకి చెందిన అబ్దుల్లా అల్ సల్మి అనే యువకుడికి  రెండు వ్యాపకాలు. అతడికి  ట్రెక్కింగ్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.   కెనడాలో తాను చదువుకుంటున్న రోజుల్లోనే ఇటువంటి సాహసాలు బోలెడన్నీ చేశాడు.  తాజాగా  గల్ఫ్ దేశాల్లో ప్రపంచకప్ జరుగుతుండటంతో  అది అతడిలో కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఫుట్‌బాల్ ఆట అంటే ఇష్టపడే అబ్దుల్లా..  సౌదీలో తాను ఉండే జెడ్డా నుంచి ఖతార్ కు  వెళ్లాలని అనుకున్నాడు.  అదీ కాలినడకన. 

కానీ అదంతా ఈజీ కాదు.  జెడ్డా నుంచి ఖతార్  (దోహా) కు  1,600 కిలోమీటర్లు. సాఫీగా వెళ్లడానికి అవేం నాలుగు వరుసల రహదారులు కావు.  అరేబియా ఎడారిని దాటాలి. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ నడవాలి.  కానీ  అబ్దుల్లా ఇవేమీ లెక్కచేయలేదు.   సౌదీ జాతీయ జెండా చేతబూని.. బ్యాగ్ లో కావాల్సిన సామాగ్రి పెట్టుకుని  సెప్టెంబర్ 9న  అతడి ప్రయాణం ప్రారంభమైంది.   55 రోజుల ప్రయాణం.  గుట్టలు, రాళ్లు, రప్పలు, ఊళ్లు, నగరాలు దాటుకుని  ఖతార్ కు చేరాడు. 

 

🇸🇦Saudi Arabia fan treks 1,600km across the Arabian Desert to attend Qatar 2022.
Abdullah Al Salmi walks from Jeddah to Doha to attend the first the region. pic.twitter.com/JWxyYOUw5v

— Alkass Digital (@alkass_digital)

అబ్దుల్లా ఇదంతా చేయడానికి కూడా సాలిడ్ రీజన్ ఉంది. దేశాల మధ్యే తప్ప  మనుషుల మధ్య సరిహద్దులు లేవని చాటి చెబుతూ.. తన నడక ద్వారా జాతీయ జట్టులో స్ఫూర్తి నింపేందుకు గాను  అతడు ఈ పనికి పూనుకున్నాడు. ఖతార్ - సౌదీల మధ్య  సరిహద్దు  అబు సమ్ర వద్ద  అబ్దుల్లాకు ఘన స్వాగతం లభించింది. అతడి పట్టుదలకు మెచ్చిన స్థానికులు, సౌదీ దేశస్తులు.. అబ్దుల్లా ఖతార్ కు చేరుకోగానే పువ్వులు,  పండ్లతో ఆహ్వానం పలికారు. వాస్తవానికి అతడు ఎర్ర సముద్రం (రెడ్ సీ) నుంచి  నడుద్దామని అనుకున్నా  అందుకు తగిన విధంగా సౌకర్యాలు లేకపోవడంతో విరమించుకుని అరేబియా ఎడారి గుండా ఖతార్ కు చేరాడు.  మరి అబ్దుల్లా ఇచ్చిన స్ఫూర్తిని  సౌదీ అరేబియా  ఏ మేరకు అందుకుంటుందో చూడాలి. 

 

🇸🇦Saudi Arabia fan treks 1,600km across the Arabian Desert to attend Qatar 2022

Abdullah Al Salmi walks from Jeddah to Doha to attend the first in the region pic.twitter.com/Yyt4sf885K

— Stad Doha (@StadDoha_en)

ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయిన సౌదీ.. డ్రా లో గ్రూప్-సీలో చోటు దక్కించుకుంది.  గ్రూప్-సీలో అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్ వంటి దిగ్గజ దేశాలతో సౌదీ పోటీ పడనుంది.  నవంబర్ 22న ఆ జట్టు.. అర్జెంటీనాతో తొలి మ్యాచ్ లో ఆడనుంది. 

click me!