వైవిఎస్‌. చౌద‌రి ఇప్పుడేం చేస్తున్నారంటే...

By Surya PrakashFirst Published May 23, 2021, 1:49 PM IST
Highlights

 2015లో రేయ్ రిలీజ్ తర్వాత ఆయన ఒక్క ప్రాజెక్టు మొదలెట్టలేదు. అయితే ఆయన తనను తాను పదును పెట్టుకోవటం మాత్రం మానలేదు. ఈ తరానికి నచ్చే ఓ కథని రెడీ చేసుకున్నారు. తన కెరీర్ ని ఎలా అయితే కొత్తవారితో ప్రారంభించారో...అదే విధంగా ఇప్పుడు కూడా అంతా కొత్త వారితో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిగా,నిర్మాతగా వైవిఎస్‌. చౌద‌రి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఎన్.టి.ఆర్‌.కు వీరాభిమాని. ప‌లు సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆయ‌న గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. బాలకృష్ణతో చేసిన ఒక్క మగాడు, సాయి ధరమ్ తేజ తో చేసిన రేయ్ సినిమాలు డిజాస్టర్స్ అవటంతో ఆయన వెనకబడ్డారు. 2015లో రేయ్ రిలీజ్ తర్వాత ఆయన ఒక్క ప్రాజెక్టు మొదలెట్టలేదు. అయితే ఆయన తనను తాను పదును పెట్టుకోవటం మాత్రం మానలేదు. ఈ తరానికి నచ్చే ఓ కథని రెడీ చేసుకున్నారు. తన కెరీర్ ని ఎలా అయితే కొత్తవారితో ప్రారంభించారో...అదే విధంగా ఇప్పుడు కూడా అంతా కొత్త వారితో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.ఈనెల 23, అంటే ఈ  ఆదివారంనాడు ఆయ‌న జ‌న్మ‌దినం. ఈ సందర్బంగా ఈ విషయాన్ని ఖరారు చేసారు. తాను ఓ వైవిధ్యమైన లవ్ స్టోరీ తయారు చేసానని అందుకోసం ఇప్పుడు ఓ తెలుగ‌మ్మాయిని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేబోతున్నారని చెప్తున్నారు.

వైవియస్ చౌదరి మాట్లాడుతూ... సుప్రీమ్‌ హీరో ‘సాయిధరమ్‌తేజ్‌’ హీరోగా తెరకెక్కిన, నా దర్శకత్వంలోని 9వ సినిమా ‘రేయ్‌’ విడుదల తదనంతర పరిమాణాల వల్ల.. నా చిరకాల సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరూ కలిసి నా ప్రతిభని మరొక్కసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తామని ఒత్తిడి చేస్తున్నారు.

 “చౌదరీ!! నేను నీకు దర్శకత్వపు అవకాశం ఇస్తున్నాను. నటీనటులు ఎవరు కావాలి నీకు?” అని అక్కినేని నాగార్జునగారు నన్ను అడిగితే “కొత్త నటీనటులను పరిచయం చేస్తూ ఒక ప్రేమకధని నా మొదటి సినిమాలా తీయాలని ఉందండి.” అని అనడంతో “ఏం? నేను అవసరం లేదా?” అని ఆయన అడగ్గా “మీరు వద్దు అనే మాట నేను అననండీ, నేను కొత్త నటీనటులను పరిచయం చేయాలి.” అని అనడంతో ఆయన “సరే!! నీ ఇష్టం.” అని అన్నారు.

గత కొన్నేళ్ళుగా.. ప్రతి సంవత్సరం వచ్చే తెలుగు ఉగాది, తెలుగు భాష దినోత్సవాల రోజున.. ‘ఈసారి ఎలాగైనా ఓ పదహారణాల తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయాల్సిందే’ అని నాలో నాకే ఒక భావోద్వేగం కలుగుతూనే ఉంది. అందుకే.. ఈసారి నా కంటికి నచ్చిన ఒక తెలుగమ్మాయిని హీరోయిన్‌గా, నా ఆశయానికి ఊతమిచ్చే ఓ హీరోతో.. మధురమైన సంగీతానికి జతగా తేనెలూరే సాహిత్యమే ప్రాధాన్యంగా.. తెలుగువారి సంస్కృతి-సంప్రదాయాలు మరియూ తెలుగువారి వాడిని-వేడిని ప్రతిబంబించే నిఖార్సైన కధతో.. వీటన్నింటికీ మించి సినిమా సృష్టి పట్ల నాకున్న వ్యామోహంతో.. ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కోవిడ్‌-19 మహమ్మారి నెమ్మదించిన తరువాత.. నా తదుపరి సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించి.. ఓ శుభముహూర్తాన సినిమా షూటింగ్‌ని ప్రారంభించడం జరుగుతుంది అని.. నా తల్లిదండ్రుల ద్వారా నా ఉనికి ప్రారంభమైన నా పుట్టిన రోజు.. మే 23 వ తేదీ సందర్భంగా మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
 

click me!