
‘సాహో’ తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ తో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాకు ఓపినింగ్స్ బాగా వచ్చాయి . టీజర్స్, సింగిల్స్, ట్రైలర్స్‌తో విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనటం కలిసొచ్చింది. అయితే ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ అభిమానుల అంచానాల్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. ప్రేక్షకులకు ఏ స్థాయిలోనూ కనెక్ట్ కాలేకపోయింది. హిందీలోనూ ఈ సినిమాని భారీగానే రిలీజ్ చేసారు.అయితే అక్కడా వర్కవుట్ కాలేదనే చెప్పాలి.
బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘రాధేశ్యామ్’కి మొదటి రోజు హిందీలో నాలుగున్నర కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో రోజు కూడా అదే పరిస్దితి. మూడో రోజు ఆదివారం కూడా పికప్ కాలేదు. మూడు రోజుల వీకెండ్ కు కలిపి హిందీ వెర్షన్ కు 12 కోట్ల లోపే వచ్చిందంటున్నారు. అంటే హిందీ వెర్షన్ కు పెట్టిన మొత్తం లో పదిశాతం కూడా రికవరీ కాలేదట. హిందీ థియోటర్ రైట్స్ ని 110 కోట్లుకు అమ్మారు. దాంతో ఈ సినిమా సేఫ్ జోన్ లోకు వెళ్లటం దాదాపు అసాధ్యం అనే అంటున్నారు. రాధేశ్యామ్ సినిమా కథలాంటివి హిందీ ప్రేక్షకులకు కొత్త కాదు. సౌత్ నుంచి వచ్చే చిత్రాలు అంటే వాళ్లు చాలా ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్,డ్రామ్ తో ఉన్న సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. అదే బాహుబలికు, సాహోకు కలిసివచ్చింది.
వాస్తవానికి ‘బాహుబలి 2’ తర్వాత వచ్చిన ‘సాహో’ ఒక్క హిందీ వర్షెన్ ఇండియాలో దాదాపు 25 కోట్ల రూపాయల ఓపెనింగ్ తెచ్చింది మొదటి రోజు. దాంతోనే, ప్రభాస్ స్టార్ పవర్ ఏంటో బాలీవుడ్ లో అందరికీ అర్థం అయింది. ఈ నేపధ్యంలో‘రాధే శ్యామ్’ కూడా చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రాబడుతుంది అని లెక్కలు వేసారు. తెలుగులో కన్నా హిందీలోనే ఇది బాగా ఆడుతుందని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దానికి తోడు ఆర్జిత్ సింగ్ పాడిన “సోచ్ లియా” పాట బాగా పాపులర్ అయింది. కానీ, రిలీజ్ తర్వాత చూస్తే అంచనాలకు,వాస్తవానికి సంభందం లేకుండా పోయింది.
ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించింది. సౌత్ లాంగ్వేజెస్‌కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు.