విశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా గ్రాండ్‌ ఓపెనింగ్‌.. స్టోరీ, బ్యాక్‌ డ్రాప్‌ డిటెయిల్స్..

By Aithagoni RajuFirst Published Apr 26, 2023, 2:53 PM IST
Highlights

విశ్వక్‌ సేన్‌ మరో సినిమాని ప్రారంభించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కే చిత్రం బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఇటీవల `దాస్‌ కా ధమ్కీ`తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కే చిత్రం బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తుంది. 

విశ్వక్‌ సేన్‌ నటించే 11వ చిత్రమిది(వీఎస్‌11). ఈ సినిమా మొదటి షాట్‌కి నిర్మాత దిల్‌రాజు క్లాప్‌ కొట్టారు. మరో నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కెమెరా స్విచాన్‌ చేశారు. నిర్మాత వెంకట్‌ బోయనపల్లి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, సాహు గారపాటి, హరీష్‌ ఎపద్ది, దర్శకులు వెంకీ అట్లూరి, మల్లిక్‌ రామ్‌, శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి, కళ్యాణ్‌ శంకర్‌ వంటి ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. చిత్ర బృందం నుంచి అంజలి కూడా పాల్గొనడం విశేషం. ఇందులో ఆమె ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. 1990లో రాజమండ్రి బ్యాక్‌ డ్రాప్‌లో ఈ కథ సాగుతుందట.

Latest Videos

`విశ్వక్ సేన్ తన అద్భుతమైన కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. స్వతహాగా విజయవంతమైన రచయిత, దర్శకుడు కావడంతో ఈ యంగ్‌ హీరో విభిన్నమైన జానర్‌లతో మనల్ని అలరిస్తున్నారు. ఈసారి కూడా కూడా ఆయన మరో విభిన్న జానర్ లో, అద్భుతమైన కథతో వస్తున్నారు. ఈ కథ పట్ల, అందులోని ఆయన పాత్ర పట్ల విశ్వక్ సేన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 90వ దశకంలో రాజమండ్రి పరిసరాల నేపథ్యంలో జరిగిన కథతో రూపొందుతోన్న 'VS11' కోసం చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరకర్త. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాది, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్ గా జాతీయ అవార్డు విజేత నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. అటువంటి ప్రతిభావంతులైన  నిష్ణాతులైన బృందంతో కలిసి.. కథల ఎంపికలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'VS11' రూపంలో మరో ఆసక్తికర చిత్రాన్ని అందించబోతున్నట్లు హామీ ఇస్తోంది` అని టీమ్‌ వెల్లడించింది. మే నుండి `VS11` రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమాలో నటిస్తున్న ఇతర ముఖ్య తారాగణం వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ని అందిస్తామని మేకర్స్ వెల్లడించారు.
 
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య

click me!