
ఫలక్నుమా దాస్ సినిమాతోనే విశ్వక్ సేన్ లో విషయం ఉందనే సంగతి తెలుగు ప్రేక్షకులకు అర్థమైపోయింది. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా మంచి మాస్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో విశ్వక్ నటన, యాటిట్యూడ్ ఎంతో మందిని ఫ్యాన్స్ గా మార్చింది. ఆ సినిమా తర్వాత విశ్వక్ ఇక వెనుతిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇంతకుముందు విడుదలైన పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా విశ్వక్ లో మనో నటుడ్ని పరిచయం చేసింది. విశ్వక్ కు ఫ్యామిలీ ఆడియన్స్ నూ దగ్గర చేసింది. ఈ దీపావళికు విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా 'ఓరి దేవుడా' విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆయన నటించిన మరో చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క 'ముఖచిత్రం' సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు. ఇందులో విశ్వక్ సేన్ ని పవర్ ఫుల్ లాయర్ గా చూపించారు. అందరినీ తన వాదనలతో ఏడిపించే సీనియర్ లాయర్ నే ఎదుర్కొని నిలబడే యంగ్ లాయర్ క్యారెక్టర్ లో కనిపించారు విశ్వక్ సేన్. ఇందులో విశ్వక్ సేన్ చెప్పిన డైలాగులు వైరల్ అవుతోంది. ఈ టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. సినిమాలో విశ్వక్ సేన్.. విశ్వామిత్రగా కనిపించబోతున్నారు. కథలో ఆయన రోల్ 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. సినిమాలో విశ్వక్ సేన్ విశ్వామిత్ర అనే పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పాత్ర సినిమాకే కీలకంగా ఉంటుందని వారు అంటున్నారు. ఇక లాయర్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని వారు తెలిపారు.
'కలర్ ఫొటో'తో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రాజ్ 'ముఖచిత్రం' సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.