
తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన తెలుగువాడు హీరో విశాల్. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న విశాల్... తన సొంత బ్యానర్.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపైనే ఎక్కువ సినిమాలు చేస్తుంటాడు. విశాల్‌కు, నిర్మాతగా తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరుంది. ఇక తాజాగా ఆయన తమిళ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గురించి ఒక ఇంటర్వ్యూలో విమర్శలు చేసినందుకు ఆయన్ను కౌన్సిల్ మెంబర్‌గా తొలగించారు.
కొన్నాళ్ళపాటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి విశాల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ఆయనకు నోటీసులు పంపింది. కాగా ఈ విషయంపై విశాల్ చాలా సరదాగా స్పందించడం ఆసక్తికరంగా చెప్పుకోవాలి. “ఇప్పుడే నన్ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్‌గా సస్పెండ్ చేసినట్లు తెలిసింది” అని చెబుతూ గట్టిగా నవ్వి, తనను కౌన్సిల్ నుంచి తీసేసినా సినీ పరిశ్రమ కోసం, ప్రొడ్యూసర్స్ బాగుండడం కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని విశాల్ స్పష్టం చేశారు.