
ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్.ఆర్.ఆర్, బాహుబలి వంటి సూపర్ హిట్సల్ తో గత ముప్పై ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా ఉన్న ఆయన ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు కథలు అందజేశారు. రాజమౌళి తండ్రిగా..మరియు ఆయన సినిమాలకు కథలు అందిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అలాగే రాజమౌళి ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు నుంచే ఈయన స్టార్ రైటర్ స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ఆయన కథలను అందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్, తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మెర్శల్ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే అందించగా.. అవి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం 1770 – ఏక్ సంగ్రామ్ అనే సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం. అప్పట్లో వచ్చిన ఆనంద మఠం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని సమాచారం. బ్రిటిష్ పాలనలో 1770 లో జరిగిన ఒక సన్యాసిల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుంది. ఆనందమఠం నవలకి నేపద్యం 1771వ సంవత్సరంలో బెంగాల్‌లో సంభవించిన మహా కరువు, సన్యాసుల తిరుగుబాటు. బంకించంద్ర చటర్జీ ఈ నవలని బెంగాలీ్‌లో రాశారు. తరువాత ఇతర భాషలలోనికి అనువదించబడింది. ఈ నవలలో ఉపయోగించిన వందేమాతరం గీతాన్ని 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ టాగోర్ ఆలపించారట. తరువాత వందేమాతరం ఎంతో ప్రఖ్యాతి చెందింది. స్వాతంత్ర్య సంగ్రామంలో జాతీయవాద నినాదంగా వాడబడింది.
ఒక స్టార్ హీరో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తారని, అంతే కాకుండా తెలుగులో ఒక యంగ్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ ఆగస్ట్ 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
మరి ఆ స్టార్ హీరో ఎవరో, యంగ్ డైరక్టర్ ఎవరో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమా అంటే ప్రేక్షకులు నిజానికి అంత ఆసక్తి చూపరు.. ఎందుకంటే సినిమా ఎంత బాగున్నా ఎన్ని వీరోచిత పోరాట సన్నివేశాలు ఉన్నా చివరికి సినిమా విషాదాంతం అవుతుంది కాబట్టి. ఐతే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాజమౌళి తెలివిగా ఆ సినిమాని కాల్పనిక సంఘటనలతో తెరకెక్కించి ముగింపులో విషాద ఛాయలు ఉండకుండా జాగర్త పడ్డారు. మరి ఏక్ సంగ్రామ్ సినిమా కూడా అదే బాటలో నడుస్తుందా లేదా అనేది చూడాలి.