
తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా ఆందోళన కరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విజయ్ కాంత్ అంతలోనే కరోనా బారీన పడి మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. విజయ్‌కాంత్ 80, 90 దశకాల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ తమిళనాడులో గుర్తింపు ఉంది.
అయితే లక్షలాదిమంది అభిమానులకు, కుటుంబ సభ్యులు దూరం అవుతూ విజయ్ కాంత్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వార్త సినీ రాజకీయ లోకాన్ని శోకంలో ముంచేసింది. కొన్ని రోజుల క్రితమే విజయ్ కాంత్ మియాట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో విజయ్ కాం ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులు భావించారు.
ఇంతలోనే విజయ్ కాంత్ కి కరోనా సోకడంతో మరోసారి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ కరోనా వల్ల ఆయన ఆరోగ్యం విషమం కావడం.. చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీనితో విజయ్ కాంత్ అభిమానులు ఆయన సేవల్ని, నటించిన చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో విజయ్ కాంత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ కాంత్ ది తెలుగోడి రక్తమే అని తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయ్ కాంత్ స్వయంగా ఓ సందర్భంలో వివరించారు. వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో తన తాత ముత్తాతలు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వలస వెళ్లారట. ఆ విధంగా విజయ్ కాంత్ కి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ తో సంబంధం ఉంది. విజయ్ కాంత్ తండ్రి, పూర్వీకులు బలిజ నాయుడు సామజిక వర్గానికి చెందిన వాళ్ళని తెలుస్తోంది.