
విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి మామూలుగా ఉండదు. అక్కడి మాస్ ఆడియన్స్ లో ఆయనంటే పిచ్చి అన్నట్లుగా ఉంటారు. తెలుగులోనూ కొద్ది కొద్దిగా మార్కెట్ ఏర్పడుతోంది. విజయ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బీస్ట్' సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
తెలుగులోను ఈ సినిమాను ఇదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు సాంగ్ వదిలారు. 'హలమితి హబీబో .. ' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీసాయి కిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనిరుధ్ - జొనిత గాంధీ ఆలపించారు.
రీసెంట్ గా రిలీజ్ చేసిన తమిళ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది. అమాయకులైన ప్రజలను కొంతమంది తీవ్రవాదులు బంధిస్తారు. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ విజయ్ రాఘవన్ గా విజయ్ రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో ఈ ఎపిసోడ్ వస్తుందనీ .. ఈ సీన్లోనే హీరోగారి లవ్ లో హీరోయిన్ పడుతుందనే విషయం అర్థమవుతోంది.
రేపు సాయంత్రం 6 గంటలకు తెలుగు ట్రైలర్ ను వదలనున్నారు. ఇటీవల పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'రాధే శ్యామ్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, పూజ హెగ్డే ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇక ఆమె చేసిన 'ఆచార్య' కూడా ఈ నెల 29వ తేదీన విడుదలవుతోంది.