
తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదల చిత్రం ఏ స్దాయితో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ విడుదల పార్ట్ 2 రాబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ విడుదల హిట్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
విజయ్ సేతుపతి , మంజు వారియర్ లతో కూడిన పోస్టర్ ను కూడా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ యాక్షన్ డ్రామా సెకండ్ పార్ట్ మరింత అలరించబోతున్నట్లు ఈ పోస్టర్ల ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాదు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై తమిళ పాపులర్ బుక్ తిరుక్కురల్ లోని వాక్యాలు కూడా ఉండటం విశేషం. "తమ శత్రువుల అహంకారాన్ని మచ్చిక చేసుకోలేని వారు.. ఎప్పుడూ సంతృప్తికరంగా జీవించలేరు" అని అర్థం వచ్చే వాక్యాలను టైటిల్ పోస్టర్ పై ఉన్నాయి. విడుదల పార్ట్ 2 షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు కూడా మేకర్స్ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. “విడుదల పార్ట్ 2తో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. విజనరీ వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన మూవీ. ఫస్ట్ లుక్ వచ్చేసింది” అనే క్యాప్షన్ తో విజయ్ ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.
నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ... విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ మా టీమ్ అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. విడుదల పార్ట్ 1 మూవీ అంచనాలు మించి విజయం సాధించింది. కమర్షియల్ అంశాలతో పాటు రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈతరం దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. యాక్టర్ సూరికి విడుదల పార్ట్ 1 మూవీ సక్సెస్ ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మహారాజ తర్వాత వస్తున్న చిత్రంగా విడుదల 2పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా విడుదల 2 సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.
దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నారు. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం విడుదల 2 మూవీకి మరో ఆకర్షణ కానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న విడుదల 2 సినిమాను ఈ ఏడాది చివరలో థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భవానీశ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు విడుదల 2లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్, ఆడియో , థియేట్రికల్ రిలీజ్ డేట్స్ ను త్వరలో అనౌన్స్ చేస్తాం. అన్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ తదితరులు కనిపించనున్నారు.