బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో అమృత ప్రణయ్ కంటెస్ట్ చేస్తుంది అంటూ చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. వీటిపై అమృత స్వయంగా స్పందించింది. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 1న జరగనుంది. స్టార్ మా ఛానల్ అధికారిక ప్రకటన కూడా చేసింది. మరో వారం రోజుల్లో స్టార్ మా లో బిగ్ బాస్ సందడి మొదలుకానుంది. ఇండియా వైడ్ అత్యంత పాప్యులర్ షోగా బిగ్ బాస్ ఉంది. 2017లో తెలుగులో ప్రారంభం కాగా ఏడు సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. నాగార్జున నేతృత్వంలో సీజన్ 8 సరికొత్త హంగులతో సిద్ధమైంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది.
కాగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ 8లో పాల్గొంటుంది అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ విషయం పై అమృత ప్రణయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. అమృత ప్రణయ్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో షేర్ చేసిన అమృత అనేక విషయాలు పంచుకుంది. ఈ మధ్య తక్కువగా యూట్యూబ్ వీడియోలు చేయడానికి కారణం.. తాను మానసికంగా కొంత ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
ఎందుకో తెలియదు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను. ఎవరైనా కదిపితే ఏడ్చేస్తానేమో అనిపిస్తుంది. అందుకే తరచుగా వీడియోలు చేయడం లేదు. చాలా మంది మీరు నాన్ వెజ్ తింటారా? అని అడుగుతున్నారు. నాకు మూడేళ్ళ వయసు నుండే నాన్ వెజ్ తినే అలవాటు ఉంది. మా నాన్న కూడా తినేవారు. మా అమ్మకు ఇష్టం లేదని మానేశాడట. నాకు చికెన్, ఫిష్ అంటే ఇష్టం. అలా అని రోజూ నాన్ వెజ్ కావాలనే టైప్ కాదు. అలాగే ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు.
మీకు నేను ఓ సంఘటన ద్వారా తెలుసు. అప్పుడు నేను ప్రెగ్నెంట్. కాబట్టి మోడ్రన్ డ్రెస్ లు ధరించే దాన్ని కాదు. నిజానికి నేను మొదటి నుండి స్కర్ట్స్, జీన్స్, ఫ్రాక్స్ ధరించే దాన్ని. అమ్మ వద్దన్నా... నాన్న ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటుందని ఎంకరేజ్ చేసేవాడు. కాబట్టి మోడ్రన్ డ్రెస్ల లో మీరు నన్ను కొత్తగా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న బిగ్ బాస్ షోకి వెళుతున్నారట కదా? కొందరు ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు.
నేను బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం లేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఎలాంటి ఫోన్ రాలేదు. ఈ పుకారు ఎలా పుట్టిందో తెలియదు. ఆఫర్ వస్తే వెళతారా? అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. వెళ్లొచ్చు వెళ్ళకపోవచ్చు.. అని అమృత ప్రణయ్ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి అమృత ప్రణయ్ బిగ్ బాస్ తెలుగు 8లో పార్టిసిపేట్ చేస్తుందన్న న్యూస్ ఫేక్..
ఎవరీ అమృత ప్రణయ్?
2018లో మిర్యాలగూడ లో ఓ పరువు హత్య జరిగింది. అగ్రవర్ణాలకు చెందిన అమృత దళితుడైన ప్రణయ్ కుమార్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చని అమృత తండ్రి ప్రణయ్ ని హత్య చేయించాడు. అమృత కళ్ళ ముందే ఓ వ్యక్తి ప్రణయ్ పై కత్తితో దాడి చేశాడు. ప్రణయ్ తీవ్ర గాయాలతో కన్నుమూశాడు. ఈ మర్డర్ కేసులో అమృత తండ్రితో పాటు మరికొందరు జైలు పాలయ్యారు. ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
జైలు నుండి బైయిల్ పై బయటకు వచ్చిన అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అమృత నిజ జీవిత కథను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరుతో సినిమా తీశాడు. ఈ చిత్రం పై అమృత వ్యతిరేకత వ్యక్తం చేసింది. విడుదల అడ్డుకోవాలని న్యాయపోరాటం చేసింది. కానీ మర్డర్ మూవీ విడుదలైంది..