
మెలోడీ మంత్రంతో తెలుగు సంగీత ప్రియులు మనసులు దోచాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పీ పట్నాయక్. రాను రాను మారిన ట్రెండ్ ప్రకారం.. ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావడంతో.. పరిశ్రమనుంచి కాస్త దూరం జరిగారు పట్నాయక్. నీకోసం సినిమాతో టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆర్పీ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు తన సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మరీ ముఖ్యంగా తేజ సినిమాలకు ఆస్తాన సంగీత దర్శకుడిగా పనిచేసిన పట్నాయక్.. ఎన్నో హిట్ సాంగ్స్ ను అందించారు. ఆ తరువాత హీరోగా మారి శ్రీను వాసంత లక్ష్మి సినిమాతో నటనలో కూడా మెప్పించారు పట్నాయక్. ఆతరువాత చిన్నగా ఇండస్ట్రీకి దూరం అయిన ఆయన.. అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్స్ లో కనిపిస్తుంటారు. చిన్న చిన్న కాన్సర్ట్ లు చేసుకుంటూ.. గడిపేస్తున్న పట్నాయక్.. తాజాగా ఓప్రయోగానికి రెడీ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఆర్పీ మరో కొత్త ప్రయోగంతో ముందుకురాబోతున్నాడు. ‘భగవద్గీత’ ను నేటి యువతకు అందించడానికి ఆడియో రూపంలో తీసుకురానున్నట్లు ప్రకటించాడు.
భగవద్గీత అనగానే మన తెలుగువారికి వినిపించేది ఘంటసాల గొంతే. అయితే ఆయన పాడిన ఆ భగవద్గీతను చావులకు మాత్రమే వాడుతున్నారు. దాంతో మామూలుగా భగవద్గీతను వినాలంటే కాస్త సంకోచించే పరిస్థితి వచ్చింది తెలుగునాట. అయితే ప్రస్తుతం ఆర్ పి పట్నాయక్ మాత్రం ఇప్పటి యూత్ కు అర్ధం అయ్యేలా.. కొత్త ఆడియో రూపంలో తీసుకురానున్నట్లు ఆర్పీ పట్నాయక్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిచారు.
ఆయన ఏమని ట్వీట్ చేశారంటే..? నేటి యువతకు సరైన మార్గ నిర్దేశం చేసే అత్యద్భుత తత్వజ్ఞానం మరియు జీవన మార్గం చూపించే శాస్త్రం భగవద్గీత కు మించి ఇంకెక్కడా దొరకదు. అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం నేటి యువత కోసం నేను రికార్డ్ చేసాను. పూర్తి వివరాలతో తొందర్లో వస్తాను.” అంటూ ఆర్పీ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు.