
ఓ సామాన్య శివ శంకర వర ప్రసాద్ వెండితెరపై చిరంజీవిగా వెలిగిపోతున్నారు. ఎవర్ గ్రీన్ స్టార్ గా నాలుగు దశాబ్దాలు నుండి ఎంటర్టైన్ చేస్తున్నారు. చిరంజీవి నుండి సుప్రీం హీరో... తర్వాత మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవిని ఫ్యాన్స్ అన్నయ్య అంటారు. కొందరు చిరు, మరికొందరు మెగాస్టార్ అని పిలుస్తారు. నటుడిగా చిరంజీవి అందుకున్న విజయాలు చేరుకున్న మజిలీలు అనేకం. ఓ దశలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డులకు ఎక్కాడు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చిరంజీవి(Chiranjeevi)ని అందరూ గౌరవించేలా చేసింది. పరిశ్రమలో ఆయన్ని అభిమానించని వారంటూ ఉండరు. ఇక దేశం మెచ్చిన హీరో అయినా చిరంజీవి తల్లికి కొడుకే. అమ్మ అంజనా దేవితో ఆయనది విడదీయరాని బంధం. ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మతోనే గడుపుతారు. స్వయంగా అమ్మకు ఇష్టమైన వంట చేసి వడ్డిస్తారు. అమ్మతో చిరంజీవికి ఉన్న అనుబంధం అలాంటిది మరి.
మరి తన పెద్ద కుమారుడు చిరంజీవిని అంజనాదేవి ఏమని పిలుస్తారో తెలుసా?. అంజనా దేవి చిరంజీవిని ముద్దుగా శంకర్ బాబు అని పిలుస్తారు. ఈ విషయం చిరంజీవి ట్వీట్ తో అర్థమైంది. నేడు అంజనాదేవి పుట్టినరోజు(Anajana devi birthday) కాగా... ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ''అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకొంటూ అభినందనలతో .... శంకరబాబు'' అంటూ స్పందించారు.
చిరంజీవికి శంకర్ బాబు అనే మరో ముద్దు పేరు ఉందని, అమ్మగారు ఆయనను అలానే పిలుస్తారని తెలుస్తుంది. కాగా అమ్మ పుట్టినరోజున నాడు పక్కన లేనన్న బాధ చిరంజీవిలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల చిరంజీవి రెండవ పర్యాయం కరోనా బారిన పడ్డారు. ఆయన ఇంటిలోనే ఐసోలేషన్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు.
మరోవైపు చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య(Acharya) విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ ఏప్రిల్ 1న విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని మరో గొప్ప కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆచార్య విడుదల పోస్ట్ ఫోన్ అయ్యింది. గత ఏడాది సమ్మర్ కి రావాల్సిన ఆచార్య కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది. 2022 ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, కరోనా వ్యాప్తి కారణంగా సమ్మర్ కి షిఫ్ట్ చేశారు.