
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెలియని సినీప్రేక్షకుడు ఉండడేమో. పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా.. జపాన్ లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉన్నసూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలంగా సినిమాల విషయంలో అభిమానులను అప్సెట్ చేస్తూ వస్తున్నారు. పలు చిత్రాల్లో నటిస్తున్న.. డైహార్ట్ ఫ్యాన్స్ కు కావాల్సిన కంటెంట్ రావడం లేదు. ఇటీవల కోలీవుడ్ లో వరుస సినిమాలతో హిట్లు కొడుతున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో రజినీ తన నెక్ట్స్ సినిమాను ప్రకటించడంతో.. అభిమానుల ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.
కామెడీతో పాటు, యాక్షన్ కూడా అద్భుతంగా చూపించగల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar). డాక్టర్, బీస్ట్ వంటి చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను అలరించిన నెల్సన్.. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. గతంలోనే సినిమాను ప్రకటించిన మేకర్స్ తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ‘తలైవా169’గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘జైలర్’(Jailer) అనే టైటిల్ ఖరారు చేశారు. రజినీ క్రేజ్ కు తగ్గట్టుగానే టైటిల్ చాలా మాస్ గా ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు దాదాపు సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నా టైటిల్స్ ను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ తరుణంలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ రాబోయే చిత్రం టైటిల్ ను త్వరగా ప్రకటించడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరోవైపు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూ అద్భుతమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్స్ లో రక్తపు మరకలతో వేళాడదీసిన ఓ కత్తి కనిపిస్తోంది. బ్యాక్ డ్రాప్ లో ఏదోక ఫ్యాక్టరీ లోకేషన్ ను చూడవచ్చు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నుంచి ఈ పోస్టర్ ను రివీల్ చేసినట్టు అర్థమవుతోంది. ఇన్నాళ్లు కామోడీ జానర్ ప్రేక్షకులను అలరించిన నెల్సన్.. ‘బీస్ట్’తో యాక్షన్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ‘జైలర్’లో రజినీని ఎలా డైరెక్ట్ చేయబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
అయితే ఈ చిత్రానికి రజినీకాంతే స్వయంగా కథ రాస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. తొలిసారిగా తన సినిమాకు తానే పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడని సినీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, రమ్య కృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ కనువిందు చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.