సైరా మెగా మూవీ: ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీరోచిత గాధ ఇదీ..

By telugu teamFirst Published Sep 30, 2019, 3:58 PM IST
Highlights

1847లో ఈ ధీరుడిని అత్యంత దాష్టికంగా తెల్ల దొరలు చంపిన వైనాన్ని తెలుసుకున్న ప్రతిఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఇతని మరణం భవిష్యత్తులో తిరుగుబాటు చేయాలనుకునేవారికి ఒక గుణపాఠంగా నిలవాలని తలంచిన తెల్ల దొరలు ఈ రేనాటి వీరుడి తలను కోట గుమ్మానికి 30సంవత్సరాలపాటు వేలాడదీశారు. ఊహించడానికే చాలా భయమేస్తోంది కదా! 

1857లో జరిగిన తొలి  భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి 10 సంవత్సరాల ముందే బ్రిటిష్ పాలకుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి వీరోచిత గాథ గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబొడవాల్సిందే. 1847లో ఈ ధీరుడిని అత్యంత దాష్టికంగా తెల్ల దొరలు చంపిన వైనాన్ని తెలుసుకున్న ప్రతిఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. 

ఇతని మరణం భవిష్యత్తులో తిరుగుబాటు చేయాలనుకునేవారికి ఒక గుణపాఠంగా నిలవాలని తలంచిన తెల్ల దొరలు ఈ రేనాటి వీరుడి తలను కోట గుమ్మానికి 30సంవత్సరాలపాటు వేలాడదీశారు. ఊహించడానికే చాలా భయమేస్తోంది కదా! 

ఇంతటి కర్కోటపు చర్య వల్ల భవిష్యత్తులో ఇంకెవరు తిరుగుబాటు చేయాలన్నా భయపడతారు అని కలలు కన్న బ్రిటిష్ పాలకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఎందరో భావి ఉద్యమకారులకు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఆదర్శప్రాయుడయ్యాడు. 

ఇంకొన్ని గంటల్లో ఈ రేనాటి వీరుడి వీరగాథను తెరమీద చూడబోతున్నాం. ఈ సందర్భంగా ఆ యోధుడి జీవిత గాథను ఒక సారి తెలుసుకుందాం. 

భారత దేశ తొలి స్వతంత్ర సంగ్రామంగా చెప్పే 1857 సిపాయిల తిరుగుబాటుకంటే ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం దక్షిణ భారత దేశంలోని ఎందరో వీరులను భారతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు ఆయుధం పట్టేలా చేసింది. 

ఉయ్యాలవాడ గ్రామమానికి చెందిన సీతమ్మ, మల్లారెడ్డిల తనయుడు మన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి. పాలెగార్ల వంశంలో జన్మించిన నరసింహారెడ్డి, బ్రిటిష్ వారు ఈ వ్యవస్థను రద్దు చేయడంతో ఒక శిస్తు వసూలుదారుగా మాత్రమే మిగిలిపోయారు. ఈ సమయానికి రాయలసీమ జిల్లాలనుహైదరాబాద్ నిజాం బ్రిటిష్ వారికి దత్తత ఇవ్వడం జరిగింది (అందుకే రాయలసీమకు దత్త మండల ప్రాంతమనే పేరు). 

పంటలు సరిగ్గా పండని కాలంలో కూడా పూర్తి శిస్తు వసూలు చేయమని నరసింహారెడ్డి ని బ్రిటిషు ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టేది. నరసింహ రెడ్డి వినకపోవడంతో అతనికిచ్చే భరణాన్ని కూడా నిలిపివేసింది. నరసింహ రెడ్డి తన భరణాన్ని కూడా ప్రజలకోసమే ఖర్చు చేసేవాడు. 

ప్రజలను ఇలా పీడించడం చూసి తట్టుకోలేకపోయిన నరసింహ రెడ్డి బ్రిటిషువారికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. 1842లో ఈ ధీరుని సైన్యం భారతీయుల శ్రమను దోచి దాచుంచిన ఖజానాలు మీద దాడి చేసారు. ఈ దెబ్బకు వణికిపోయిన బ్రిటీషువారు నరసింహారెడ్డి పై 10వేల దినార్ల ఇనాం ప్రకటించారు. 

1842 నుంచి ప్రయత్నిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం 5 సంవత్సరాల తరువాత కానీ నరసింహ రెడ్డిని పట్టుకోలేకపోయింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జగన్నాథస్వామి ఆలయంలో నరసింహ రెడ్డిని పట్టుకుంది బ్రిటిష్ సైన్యం. ఇంత గొప్పవీరుడిని, బందిపోటుగా చిత్రీకరించింది. 

కోవెలకుంట్ల దేగ్గర్లోని జుర్రేరు నది వద్ద ఈ వీరుడిని ఉరి తీశారు. ఉరితీసేముందు బ్రిటీషువారు ఎమన్నా చివరి కోరిక ఉందా అని అడిగితే, ప్రజలతో మాట్లాడాలి అని అన్నారట నరసింహ రెడ్డి. అసలే బ్రిటిషువారిపై కోపంతో రగిలిపోతున్న ప్రజలు, మరోపక్క ఉరికంభంపై వారికి దైవంతో సమానమైన నరసింహ రెడ్డి, ఇతను గనుక మాట్లాడితే ఇంకేమన్నా ఉందా! ప్రజలు కట్టలుతెంచుకొని బ్రిటిషువారిమీద పడటం ఖాయం. ఈ విషయం గ్రహించిన బ్రిటీషువారు అతని ఆఖరు కోరిక తీర్చకుండానే ఉరితీశారు. 

నరసింహ రెడ్డి తలను కోటగుమ్మానికి 30 సంవత్సరాలపాటు వేలాడదీశారు.  బ్రిటిషు వారిలో క్రూరత్వం ఎంతలా ఉండేదో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 1847 నుంచి 1877 వరకు ఆ తల అలానే వేలాడుతూ ఉంది. వారి ఆటవికతను ఊహించడం కూడా కష్టంగా ఉంది కదూ!

చరిత్రలో మరుగునపడ్డ ఈ అన్ సంగ్ హీరో గురించి మనకు చాల తక్కువ చరిత్ర అందుబాటులో ఉంది. అందునా మన దక్షిణ భారతదేశానికి చెందిన ఇలాంటి వీరులు భారత తొలి స్వతంత్ర సంగ్రామానికి దశాబ్ద కాలం పూర్వమే బ్రిటిషువారిని ఎదిరించడం మనకు గర్వకారణం. ఇలా మన యోధుడి చరిత్రను తెరమీద చూసుకునే అదృష్టం కలిగినందుకు నిజంగా మనం గర్వపడాల్సిందే. 

click me!