బ్రేకింగ్ : సీనియర్ నటి జమున కన్నుమూత

By team teluguFirst Published Jan 27, 2023, 8:59 AM IST
Highlights

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున తుదిశ్వాస విడిచారు. 

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున(86) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మరణించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాం లో జమున స్టార్ నటిగా వెలుగొందిన సంగతి తెలిసిందే. 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఇంటికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆమె ఈ ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వెండితెరపై జమున నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గడసరి అచ్చతెలుగు ఆడపిల్లలా ఆమె సినీ ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. మహానటి సావిత్రితో కలసి హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. 

జమున 1936లో హంపిలో జన్మించారు.ఆమె 1953లో పుట్టిల్లు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. కెరీర్ ఆరంభంలోనే ఆమె ఎన్టీఆర్ ఎన్నార్ సరసన నటించే అవకాశం అందుకుంది. 1955లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి నటించిన ఆల్ టైం క్లాసిక్ మిస్సమ్మలో జమున కూడా నటించారు. 

గుండమ్మ కథ చిత్రంలో అయితే జమున నటనని ఎప్పటికీ మరచిపోలేము. గులేబకావలి కథ, మూగమనసులు ఇలాంటి చిత్రాల్లో జమున నటవిశ్వరూపం చూడొచ్చు. కుటుంబ కథా చిత్రాలు, పౌరాణికాలు, జానపదాలు ఇలా అన్ని జోనర్స్ లో తన నటనతో జమున మెప్పించారు. పొగరుబోతు అమ్మాయిగా నటించాలంటే అప్పట్లో గుర్తుకువచ్చేది జమున మాత్రమే. 

ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి లతో జమునకి మంచి సాన్నిహిత్యం ఇది. సావిత్రి చివరిరోజుల సంఘటనలని జమున తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. జమున తన కెరీర్ లో అనేక ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. జమున భర్త జూలూరి రమణారావు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంతానం. 

జమున రాజకీయాల్లో కూడా రాణించారు. 1980లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో రాజమండ్రి నుంచి లోక్ సభ ఎంపీ గా విజయం సాధించారు. తిరిగి 1991లో ఓటమి చెందడంతో ఆమె రాజకీయాలకు దూరం అయ్యారు. 

జమున మరణవార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కి పడింది. కృష్ణ, కృష్ణం రాజు ఇలా వరుసగా ఆ తరం నటులంతా వరుసగా తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు. ఇప్పుడు జమున కూడా మరణించడం తీవ్ర విషాదంగా మారింది. జమున మృతితో సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 

 

click me!