భారత అత్యున్నత పురస్కారం అందుకున్న చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. వీరితోపాటు పద్మ అవార్డు గ్రహీతలకు సత్కరించింది.
మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఆయన్ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి అభినందనలు తెలియజేసింది. తాజాగా పద్మ పురస్కారాలు అందుకున్న తెలంగాణ వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించింది. ఈ ఆదివారం ఉదయం శిల్పకళావేదికలో ప్రత్యేకంగా ఈ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఇందులో భారత అత్యున్నత పురస్కారం అందుకున్న చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది. శాలువా కప్పి, ప్రభుత్వం తరఫు నుంచి జ్ఞాపికని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన గొప్పతనం గురించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రశంసలతో ముచ్చెత్తారు. చిరంజీవితోపాటు పద్మ శ్రీ పురస్కారాలు అందుకున్న వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం సత్కరించడం విశేషం. సత్కారంతోపాటు రూ.25లక్షల నగదు బహుమతిని అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్టాల్లో కొన్ని ఏళ్లుగా నంది అవార్డులను ఇవ్వలేదని, ఇది తనకు కాస్త బాధగా ఉందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో గద్దర్ పేరుతో ఈ అవార్డులు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లని ముందుగా ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోడీదే అని తెలిపారు. సామాజిక సేవ చేసే బాధ్యత ఆర్టిస్టులు స్వయంగా ముందుకురావాలని, నా అభిమానులు నా కోసం ప్రాణాలు కాదు, రక్తం ఇవ్వాలన్నారు. తాను అవార్డుల కోసం ఎదురుచూడను అని, అవార్డులు రావాలని కోరుకోనని తెలిపారు. పద్మ భూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మ విభూషణ్ వచ్చినందుకు అంతగా ఉత్సాహం లేదన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు చిరు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయని, నంది అవార్డుల ప్రోత్సాహం అనేది చాలా ఏళ్లు అవుతుందన్నారు. అవి ఇవ్వాలని కోరుతున్నట్టు వెల్లడించారు. ఇక వెంకయ్య నాయుడికి కూడా పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన నేపథ్యంలో ఆయనపై ప్రశంసలు కురిపించారు చిరు. ఆయన ప్రసంగాలకు తాను అభిమానిని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, వ్యక్తిగత విమర్శలు తగవు అని, ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయని, వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లని తిప్పికొట్టే విధంగా ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
అంతకు ముందు శనివారం రాత్రి చిరంజీవి ఇంట్లో సినీ, రాజకీయ ప్రముఖులకు ఉపాసన సమక్షంలో చిరంజీవికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రాండ్‌గా పార్టీ అరెంజ్ చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.