
నందమూరి కుటుంబంతో పాటు, అభిమానుల గుండెల్లో తీవ్ర విషాదాన్ని నింపి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు సినీ నటుడు తారకరత్న (Nandamuri Taraka Ratna). నందమూరి తారకరత్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కుప్పంలో యువగళం పాదయాత్రలో ఉండగా తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే గుండె పనిచేయకపోవడాన్ని వైద్యులు గుర్తించారు. సుమారు 45 నిమిషాల పాటు గుండె పనిచేయకపోవడంతో దాని ప్రభావం మెదడుపై పడింది.
మెదడులో ఇన్ఫెక్షన్ రావడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజులపాటు చికిత్స పొందిన తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పవిత్రమైన శివరాత్రి రోజున తారకరత్న శివైక్యమయ్యారు. 39 ఏళ్ల వయసుకే తనువు చాలించి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. నందమూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులు కూడా తారక రత్న అకాల మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
2003 లో "ఒకటో నంబర్ కుర్రాడు" సినిమాతో అశ్విని దత్ నిర్మాణంలో హీరోగా మారిన తారక రత్న ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ, గెలుపు ఓటమి లను చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటూ ముందుకెళ్లేవారని చెప్తారు. ఒక నటుడిగా మాత్రమే కాక తారక రత్న ను ఒక వ్యక్తిగా కూడా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. అయితే "మహానటి" ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న "ప్రాజెక్ట్ కే" సినిమా లో తారకరత్న ను ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేయాలని అనుకున్నట్లు నిర్మాత అశ్విని దత్ అంటున్నారు.
ఈ పాత్ర గురించి ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్‌తో తాను చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు అశ్విని దత్. కానీ అప్పుడే జనవరి 27న తారక రత్న భారీ కార్డియాక్ అరెస్ట్ కు గురవ్వడంతో విధి వేరే ప్రణాళికలను వేసుకుంది అని అశ్విని దత్ బాధపడ్డారు. లేకపోతే ఆ సినిమాతో తారకతర్న కెరీర్ మళ్లీ రీలాంచ్ అయ్యేదేమో అని బాధ పడుతున్నారు.